ఎమ్మెల్యేను కలిసిన ఏసీపీ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేను కలిసిన ఏసీపీ

May 24 2025 10:05 AM | Updated on May 24 2025 10:05 AM

ఎమ్మె

ఎమ్మెల్యేను కలిసిన ఏసీపీ

షాద్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ నుంచి షాద్‌నగర్‌ ఏసీపీగా బదిలీపై వచ్చిన లక్ష్మీనారాయణ శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన వీర్లపల్లి శంకర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు.

తీర్థయాత్రకు వచ్చిన వ్యక్తి అదృశ్యం

మొయినాబాద్‌: తీర్థయాత్రలు తిరుగుతూ చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం మోజయపేటకు చెందిన ఊరిటి దేముడు(56) నలభై మంది బృందంతో ఈ నెల 14న తీర్థయాత్రలకు బయలుదేరారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో మున్సిపల్‌ పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న తరువాత భూమహాలక్ష్మి ట్రస్టుకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో దేముడు అదృశ్యమయ్యాడు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

అనుమానాస్పద స్థితిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి

ఇబ్రహీంపట్నం: అనుమానస్పద స్థితిలో ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సీఐ జగదీశ్‌ తెలిపిన ప్రకారం.. గుంటూరు జిల్లా గురుజాల గ్రామానికి చెందిన నాగిరెడ్డి(32) మంగళ్‌పల్లి పరిధిలోని భారత్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడు నెలల నుంచి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అదే కళాశాలలో పనిచేసే శివకృష్ణారెడ్డితో కలిసి సమీపంలోని సుప్రియ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆరురోజుల రూమ్‌మెంట్‌ శివకృష్ణారెడ్డి తన స్వగ్రామానికి వెళ్లాడు. మద్యానికి బానిసైన నాగిరెడ్డి శనివారం నుంచి గదిలోనే మద్యం సేవిస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఆయన తలపై మంచానికి(బెడ్‌)కు ఉన్న ఐరన్‌ పైపు తలపై పడటంతో గాయమై తీవ్ర రక్తస్రామైంది. క్షతగాత్రుడు మత్తులోనే మృతి చెందినట్లు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం హాస్టల్‌ గదికి వచ్చిన శివష్ణారెడ్డి విషయం గమనించి కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి సమాచారాన్ని ఇచ్చాడు. మృతుడి బావమరిది వెంకటకృష్ణారెడ్డి ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు

ఒకరి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం

బీబీనగర్‌: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బీబీనగర్‌ సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మొయినాబాద్‌కు చెందిన చేగూరి రామస్వామిగౌడ్‌(60), లక్ష్మి దంపతులు వారి కోడళ్లు భూమిక, మనీషతోపాటు వీరి పిల్లలు అక్షిత్‌, అక్షయ్‌, శ్రీయాంక, సహస్రలతో కలిసి గురువారం సాయంత్రం కారులో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నర్సింహ స్వామి దర్శనానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. బీబీనగర్‌కు రాగానే జాతీయ రహదారిపై ఉన్న ఫ్లైఓవర్‌ సమీపంలో కారు అదుపు తప్పి సర్వీస్‌ రోడ్డుపైకి పల్టీ కొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసం కాగా.. వాహనంలోని ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను బయటకు తీశారు. నేషనల్‌ హైవే అంబులెన్స్‌లో వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా రామస్వామి, లక్ష్మితోపాటు, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రామస్వామి మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.

ఆరు కిలోల గంజాయి సీజ్‌

నిందితుడికి రిమాండ్‌

చేవెళ్ల: బస్టాండ్‌లో గంజాయి సంచితో అనుమానంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఒడిశాకు చెందిన కరుణాకర్‌ గౌడ సికింద్రాబాద్‌ నుంచి మెహదీపట్నం అక్కడ నుంచి చేవెళ్ల బస్‌స్టేషన్‌కు వచ్చాడు. అతడి సంచిలో గంజాయి పెట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. విశ్వసనీయ సమచారం అందుకున్న రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అతని కదలికలు గమనిస్తూ చేవెళ్ల పోలీసులతో కలిసి వ్యక్తిని పట్టుకుని ఆరుకిలోల గంజాయి ప్యాకెట్లను సీజ్‌ చేశారు. శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

యాచారం: నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు... నల్గొండ జిల్లా చందంపేటకు చెందిన కృష్ణ(32) గురువారం అర్ధరాత్రి బైక్‌పై యాచారం నుంచి మాల్‌ వైపు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో చింతపట్ల గేట్‌ వద్ద తుఫాన్‌ ఢీకొట్టింది. ఈ సంఘటనలో కృష్ణకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యేను కలిసిన ఏసీపీ 
1
1/3

ఎమ్మెల్యేను కలిసిన ఏసీపీ

ఎమ్మెల్యేను కలిసిన ఏసీపీ 
2
2/3

ఎమ్మెల్యేను కలిసిన ఏసీపీ

ఎమ్మెల్యేను కలిసిన ఏసీపీ 
3
3/3

ఎమ్మెల్యేను కలిసిన ఏసీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement