
బడ్జెట్‌లో విద్యకు ప్రాధాన్యమివ్వాలి
చేవెళ్ల: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి తగిన ప్రాధాన్యం ఇచ్చి 15 శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.మహిపాల్ డిమాండ్ చేశారు. బుధవారం చేవెళ్లలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మరిచిపోయిందన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 90 శాతం మంది విద్యార్థులు పేద, మధ్య తరగతికి చెందినవారే ఉన్నారన్నారు. వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిపులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అధిక ఫీజుల వసూళ్ల నియంత్రణపై చర్యలు తీసుకోవాలన్నారు. గురుకులాల్లో దాదాపు 83 మంది విద్యార్థులు మృతి చెందారని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవటం బాధాకరమన్నారు. గురుకులాలలో ప్రవేశపెట్టిన కామన్ మెనూ అటకెక్కిందన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో ఏబీవీపీ నాయకులు ప్రేమ్, శివ, సంధ్య, పూజిత తదితరులు ఉన్నారు.
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహిపాల్