‘కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’ | Sakshi
Sakshi News home page

‘కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’

Published Mon, Nov 27 2023 7:10 AM

మాట్లాడుతున్న బాధిత కుటుంబ సభ్యులు - Sakshi

హిమాయత్‌నగర్‌: తమకు చెందిన కోట్ల రూపాయల వ్యవసాయ భూమిని కబ్జా చేసి ముగ్గురు వ్యక్తులను హత్య చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఓ బాధిత కుటుంబం ప్రభుత్వానికి వేడుకుంటుంది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ సంఘటనలపై సీబీఐచే వెంటనే విచారణ జరిపించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం బషీర్‌ బాగ్‌ దేశోద్దారక భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా, అబ్ధుల్లాపూర్‌మెట్‌ మండలం, తారామతిపేట్‌ నివాసులు కొరకొక్కుల భూలక్ష్మి, కుమార్తెలు, కొడుకు మాట్లాడుతూ.. తారామతిపేట్‌లో తన తండ్రి మూల స్వామికి చెందిన 200 ఎకరాల భూమిని తమ సమీప బంధువు, స్థానిక సర్పంచ్‌ మూల మహేశ్‌ కుటుంబం, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి చలమల కష్ణారెడ్డి తదితరులు కలిసి తమ భూమిలో అక్రమ లేవుట్లతో కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయాలపై తమ సోదరుడు అంజయ్య హైకోర్టును ఆశ్రయించారు. కబ్జాలను అడ్డుకుంటున్న తమ సోదరుడు అంజయ్య, సోదరుడి కుమారుడు శివ ప్రసాద్‌ను ఆధారాలు లేకుండా హత్య చేశారని ఆరోపించారు. ఈ విషయాలన్నింటిపై సీబీఐచే విచారణ జరిపించాలని 2023 మార్చి 28న హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆమె వివరించారు. వెంటనే సీబీఐచే విచారణ ప్రారంభించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు భూలక్ష్మి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement