మట్టిలో మాణిక్యాలు.. మైదానంలో చిరుతలు | - | Sakshi
Sakshi News home page

మట్టిలో మాణిక్యాలు.. మైదానంలో చిరుతలు

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

● క్రీడల్లో రాణిస్తున్న పల్లె యువత

సాక్షి, పెద్దపల్లి/వేములవాడ: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటుతున్నారు. సౌకర్యాల కొరత.. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంకల్పం ముందు అవి చిన్నబోతున్నాయి. ఎందరో యువ క్రీడాకారులు తమ ప్రతిభకు పదును పెడుతూ పతకాల వేటలో దూసుకెళ్తున్నారు. ఏషియన్‌ గేమ్స్‌లో ఆర్చరీలో రెండు స్వర్ణ పతకాలతో మెరిసిన చికిత విజయగాథ ఉమ్మడి జిల్లాలోని యువ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.

చేయూతనిస్తే అద్భుతాలే..

క్రీడల్లో రాణించాలనే తపన ఉన్నా చాలామంది యువతకు సరైన శిక్షణ, ఆధునిక క్రీడా పరికరాల కొరతతో వెనుకబడుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక కొందరు క్రీడలకు దూరమవుతున్నారు. మరికొందరికి తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన వేదికలు దొరకడం లేదు. ఇలాంటి ప్రతిభను పాఠశాల స్థాయి నుంచే గుర్తించి.. నాణ్యమైన కోచింగ్‌, ఆధునిక క్రీడాసామగ్రిని, ప్రత్యేక శిక్షణ శిబిరాలు, పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారనేందుకు చికితనే నిదర్శనం. పతకాలు సాధించిన తర్వాత సన్మానాలు చేయడం కంటే.. పతకం కోసం వారు చెమటోడుస్తున్న సమయంలోనే అండగా నిలిచి.. ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో పాఠశాల స్థాయి నుంచే ప్రతిభను గుర్తించి నిరంతరం శిక్షణ అందించాలి. అలా చేస్తే ఇప్పుడు పతకాల కోసం పరుగులు తీస్తున్న ఈ చిన్నారులే రేపు దేశ జెర్సీని ధరించి అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించే స్థాయికి ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వేములవాడలో కబడ్డీ కూత

వేములవాడలో రెండు రోజులుగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జాతీయస్థాయిలో పోటీపడ్డ క్రీడాకారులు తమ సొంత జిల్లాల తరఫున బరిలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర జట్టు తరఫున కలిసి పోరాడిన వారు.. ఇప్పుడు తమ జిల్లాల తరఫున కూత పెడుతున్నారు. దీంతో ఈ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా మ్యాట్‌పై పోటీలు నిర్వహిస్తుండడంతో క్రీడాకారులు సైతం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మట్టిపైన తరచూ గాయాలపాలయ్యే క్రీడాకారులు మ్యాట్‌పై అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం లేదు. ఈనెల 2 నుంచి 5 వరకు జరిగే పోటీల్లో అండర్‌–16 బాలికలు, అండర్‌–20 బాలురు మొత్తంగా 68 జట్లు పాల్గొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement