చందుర్తి(వేములవాడ): చెదిరిన తారు రోడ్డును బాగు చేయించిన అధికారులు సైడ్‌బర్మ్స్ వేయించడంలో విఫలమయ్యారు. నాలుగేళ్లుగా సైడ్‌బర్మ్స్ లేక వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలకు సైడ్ ఇవ్వాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, పాలకులు స్పందించడం లేదు.
స్పీడ్‌గా వెళ్తే అంతే..
ఆర్‌అండ్‌బీ రోడ్డు పరిధిలో వేములవాడరూరల్ మండలం హన్మాజీపేటనుంచి చందుర్తి మండలం ఎన్గల్, బండపల్లి మీదగా కోనరావుపేట మండలం బావుసాయిపేట వరకు 10.800 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతు చేశారు. రూ.1.49కోట్లతో 2022లో పనులు చేశారు. కానీ రోడ్డుకు ఇరువైపులా మొరం పోయించలేకపోయారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డుపై ఇప్పటికే పదికి పైగా కార్లు, రెండు లారీలు, ట్రాక్టర్లు సైడ్ ఇవ్వబోయి బోల్తా పడ్డాయి.
సూచికబోర్డులు లేక తిప్పలు
ఆర్‌అండ్‌బీ అధికారులు సూచికబోర్డుల ఏర్పాటును మరిచిపోయారు. దారి పొడవునా ఎక్కడ మూలమలుపులు ఉన్నాయో, ఎక్కడ ఎత్తువంపులు ఉన్నాయో తెలియక స్పీడ్‌గా వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్తున్నాయి.
తారు రోడ్డు వేసి మట్టి పోయకుండా వదిలేసిన బండపల్లి–ఎన్గల్ రహదారి
బండపల్లిలో ధాన్యం లోడుతో
బోల్తాపడ్డ లారీ (ఫైల్)
మొరం పోయిస్తాం
తారు రోడ్డు పనులు చేయించినప్పుడు ఇక్కడ నేను లేను. సైడ్‌బర్మ్స్ పోయించకపోవడంతో ఎదురెదురుగా భారీ వాహనాలు వస్తే రోడ్డు దిగడం ఇబ్బందిగా ఉన్నది వాస్తవమే. మెయింటనెన్స్ నిధులు ఉంటే మొరం పోయిస్తాం. లేదంటే గతంలో తారు వేసిన కాంట్రాక్టర్‌తో మాట్లాడుతాం.
– నవ్యశ్రీ, ఆర్‌అండ్‌బీ ఏఈ, చందుర్తి


