వేములవాడఅర్బన్: వేములవాడలో గురువారం మంత్రుల పర్యటన సందర్భంగా చేపట్టిన భద్రత ఏర్పాట్లను ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ బుధవారం పరిశీలించారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం, రాజన్న గుడిచెరువులో ట్యాంక్‌బండ్ పార్క్ ప్రాంతాలను సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రత చర్యలను కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. డీఎస్పీలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐ వీరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ లోకేశ్, తహసీల్దార్ జయంత్‌కుమార్, ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం భూపతిరెడ్డి, మేనేజర్ శ్రీనివాస్ ఉన్నారు.
ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని దమ్మన్నపేట హైస్కూల్‌లో బుధవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహించారు. అటవీశాఖ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘పులుల సంరక్షణ’పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. స్కూల్ ఇన్‌చార్జి హెచ్‌ఎం నారాయణ, ఉపాధ్యాయులు సంపత్‌కుమార్, గుడికాడి కొమురయ్య, శని గరం నారాయణ, అజ్మీర కవిత పాల్గొన్నారు.
భూముల రీసర్వేపై అవగాహన
తంగళ్లపల్లి/ఇల్లంతకుంట(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలం రామచంద్రపూర్, ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామాలను భూముల రీసర్వే కోసం పైలట్ గ్రామాలుగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా బుధవారం ఆయా గ్రామాల్లో భూముల కొలతలు, రికార్డుల పరిశీలన విధానం, సర్వే సమయంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు. డీఐ వెంకటాచారి, ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్‌లు మురళీకృష్ణ, సురేశ్, ఆర్‌ఐ సాయికృష్ణ, సర్వేయర్‌లు చంద్రమోహన్, మధుసూదన్, సర్పంచులు గంధం శ్రీనివాస్, గొడుగు విఠల్ తదితరులు పాల్గొన్నారు.
రేపు సిరిసిల్లలో మినీ జాబ్ మేళా
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో ఈనెల 31న మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల బుధవారం తెలిపారు. ప్రైవేటు కంపెనీ విశ్వ ఆగ్రోటెక్ నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు రూ.18వేల వరకు వేతనం లభిస్తుందని, వివరాలకు 95027 47820, 73827 94374లలో సంప్రదించాలన్నారు.


