ఫంక్షన్‌కు వెళ్లి.. రైల్వే ట్రాక్‌ వద్ద శవమై.. | - | Sakshi
Sakshi News home page

ఫంక్షన్‌కు వెళ్లి.. రైల్వే ట్రాక్‌ వద్ద శవమై..

Jul 29 2026 12:16 AM | Updated on Jul 29 2026 12:16 AM

మెట్‌పల్లిరూరల్‌: మెట్‌పల్లి మండలం సత్తక్కపల్లి శివారులో రైలు ఢీకొని ఒకరు మృతి చెందారు. మంగళవారం సాయంత్రం సమయంలో గ్రామ శివారులోని రైల్వే ట్రాక్‌ వద్ద ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం గాండ్లపేటకు చెందిన మామిడి రాజగంగారాం(60)గా గుర్తించారు. రాజగంగారాం కమ్మర్‌పల్లి సమీపంలోని నాగాపూర్‌లో ఓ ఫంక్షన్‌ వచ్చినట్లు సమాచారం. అక్కడ మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు రైల్వే ట్రాక్‌ పక్కన శవమై కనిపించడంతో కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఘటనపై విచారణ చేపడుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

వేములవాడరూరల్‌: వేములవాడ రూరల్‌ మండలం నాగాయపల్లి గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చెట్టిపల్లి శ్రీకాంత్‌ (38) మంగళవారం ఓ ఇంట్లో కరెంట్‌ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే వేములవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి తల్లి రాజేశ్వరి ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై వెంకట్రాజంను వివరణ కోరగా, శ్రీకాంత్‌ ఫిట్స్‌తో మృతిచెందాడని, ఇప్పటి వరకు మృతుడి బంధువుల నుంచి ఏలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. దీనిపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తానని తెలిపారు.

బండరాయి మీద పడి కూలీ మృతి

మానకొండూర్‌: గంగిపల్లి గ్రామ శివారులో రెడ్డి కొమురయ్య(52) అనే కూలీ పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బండరాయి మీద పడి బావిలోనే దుర్మరణం చెందాడు. గంగిపల్లి గ్రామ శివారులో కొండపల్కల గ్రామానికి చెందిన బాపురెడ్డి వ్యవసాయ బావిలో పూడిక తొలగింపు పనులు క్రేన్‌ సహాయంతో చేపట్టారు. బావిలోకి దిగిన కొమురయ్య తోటి కూలీలతో పని చేస్తున్న సమయంలో క్రేన్‌ బకెట్‌(డబ్బా) నుంచి బండరాయి జారి అతడి తలపై పడింది. తీవ్ర గాయాలతో కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మానకొండూర్‌ సీఐ పి.శ్రీలత ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం ఇస్తేనే మృతదేహాన్ని కరీంనగర్‌కు తరలించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్‌ చేయగా.. వారికి నచ్చజెప్పి న్యాయం చేస్తామని సీఐ మృతదేహాన్ని కరీంనగర్‌కు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉండగా.. అందరికీ వివాహమైంది.

కోనరావుపేటలో ఒకరికి డెంగీ

కోనరావుపేట(వేములవాడ): మండలకేంద్రంలో ఒకరికి డెంగీ పాజిటివ్‌ వచ్చినట్లు వైధ్యాధికారులు గుర్తించారు. సదరు వ్యక్తి కొద్ది రోజులక్రితం హైదరాబాద్‌ వెళ్లి వచ్చాడు. తర్వాత అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా రక్త కణాలు తగ్గినట్లు గుర్తించారు. వెంటనే వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మండల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో ఇంటింటా సర్వే చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement