మెట్‌పల్లి: డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 8 మంది ప్రయాణకులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆర్టీసీ వరంగల్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు మంగళవారం ఉదయం 3.30 గంటల సమయంలో నిజామాబాద్ నుంచి బయల్దేరింది. ఆ సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం ఐదు గంటలకు మెట్‌పల్లి సమీపంలోకి రాగానే.. ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ వద్ద అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న షౌకత్ అలీ, పంకజ్, అక్షయ్, నదీమ్, ఖదీర్, రాజు, జుబేర్, ప్రవీణ్ గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం కొందరిని జగిత్యాలకు తరలించారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
గాయపడ్డ ప్రయాణీకులు
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
8 మంది ప్రయాణికులకు గాయాలు


