సైదాపూర్: ఆరెపల్లిలోని తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణంలో మంగళవారం శవాన్ని పూడ్చివేసిన ఘటనతో క్రీడాకారులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన లొల్లేటి భిక్షపతి మృతిచెందగా.. మృతదేహాన్ని ఆరెపల్లి తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణంలోనే పూడ్చేశారని గ్రామస్తులు, క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే శ్మశాన వాటిక ఉన్నా.. కాల్చకుండా ఎదురుగా ఉన్న క్రీడాప్రాంగణంలో పూడ్చేశారు. ఈ ఏడాది వర్షాల్లేక.. చెరువులోకి నీరు రాక మైదానం ఆటలకు అనుకూలమైంది. నెల రోజులుగా ఈ క్రీడాప్రాంగణంలో సైదాపూర్, వెన్కెపల్లి, జాగీర్‌పల్లి, రాంచంద్రాపూర్, ఎలబోతారం, వెన్నంపల్లి గ్రామాలతోపాటు మానకొండూర్ నియోజకవర్గం నుంచి కూడా క్రీడాకారులు వచ్చి క్రికెట్ టోర్నమెంట్, క్రీడలు నిర్వహించుకున్నారు. మండలంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడాప్రాంగణాల్లో ఎక్కడ ఆట స్థలం లేదు. కేవలం ఆరెపల్లి క్రీడాప్రాంగణంలో మాత్రమే మైదానం ఉండడంతో.. మైదానాన్ని చదును చేసుకొని రోజూ క్రీడలు నిర్వహించుకుంటున్నారు. పంచాయతీ అధికారులు, పాలకులు చర్యలు తీసుకొని క్రీడాప్రాంగణాన్ని వినియోగంలోకి తేవాలని గ్రామస్తులు, క్రీడాకారులు కోరుతున్నారు.


