పౌర సరఫరాల కొత్త డీఎంగా గోపాల్ ధాన్యం అక్రమాల్లో మరికొందరి పాత్రపై అనుమానాలు పట్టుబడిన లారీని జరిమానాతో సరిపెట్టారు లారీ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లపై చర్యలేవీ?
జిల్లాలో ధాన్యం కొను‘గోల్‌మాల్’ వ్యవహారంలో మరి కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పౌరసరఫరాల శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకరు గతేడాది గన్నీ సంచుల లెక్కల్లో తేడాలు వచ్చాయంటూ, ఒక్కో కొనుగోలు కేంద్రం నిర్వాహకుల వద్ద రూ.3వేల నుంచి రూ.5వేల వ రకు వసూలు చేశారు. సదరు అవుట్ సోర్సింగ్ ఉ ద్యోగి ధాన్యం కొను‘గోల్‌మాల్’ వ్యవహారంలో చే తివాటాన్ని ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. అత డి అక్రమాలు బయటకు రాకుండా ఉన్నతాధికారు ల స్థాయిలో మేనేజ్ చేసినట్లు సమాచారం. ఇప్పటి కేపలువురు అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లపై చర్యలేవీ?
ధాన్యం కొనుగోళ్లలో 13 లారీల ధాన్యం పక్కదారి పట్టించారు. ఇందులో 12 లారీల ధాన్యం వేములవాడ ప్రాంతానికి చెందినవి కాగా, ఒక్క లారీ సిరిసిల్ల ప్రాంతానికి చెందినది. ఒక్క లారీకి సంబంధించిన ఆదిత్య లారీ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసి అతన్ని బ్లాక్ లిస్ట్‌లో ఉంచారు. మరి ఆ 12 లారీల ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుంది. సదరు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ తన పలుకుబడితో పౌరసరఫరాల శాఖ అధికారులను మేనేజ్ చేశారనే ఆరోపణలున్నాయి.
జరిమానాతో వదిలేశారు
కోనరావుపేట మండలం మర్తనపేటకు చెందిన వినాయక రైస్ మిల్లుకు చెందిన ఏపీ 16టీసీ 9677 నంబరు గల లారీ ఇటీవల ధాన్యం లోడుతో సిరిసిల్ల శివారు చంద్రంపేట వద్ద పార్కింగ్ చేసి ఉంది. లారీలోని ధాన్యాన్ని తరలించేందుకు వే బిల్లు ఏమీ లేక పోవడంతో డ్రైవర్ పరార్ అయ్యారు. దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ చేపట్టి 800 బస్తాల లోడుతో ఉన్న లారీని రాఘవేంద్ర రైస్ మిల్లులో సీజ్ చేసి ఉంచారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు రూ.50వేలు జరిమానాతో ఆ లారీని వదిలి వేసినట్లు సమాచారం. ఈ కేసులో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలిసింది. ఎలాంటి వే బిల్లు లేకుండా, మరో రైస్ మిల్లుకు వడ్లను తరలించడంపై రూ.50వేల జరిమానాతో వదిలేయడం అనుమానాలకు తావిస్తుంది. ఏది ఏమైనా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు.. అటు అధికా రులు ఇటు రైస్ మిల్లర్లలో వణుకు పుట్టిస్తున్నాయి.
సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొను‘గోల్‌మాల్’ వ్యవహారంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహారెడ్డిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సిరిసిల్ల అపరెల్ పార్క్ గోదాం ఇన్‌చార్జి ఉత్కం గోపాల్‌తో చేతులు కలిపి 13 లారీల ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఘటనలో నర్సింహారెడ్డిని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సరెండర్ చేయగా, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌గా గోపాల్‌ను నియమించినట్లు సమాచారం. ఆయన ఒకట్రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నారు.


