నగదు కూలీ పేరుతో శ్రమదోపిడీ పట్టింపులేని అధికారులు కొందరు టేకేదారుల అక్రమార్జన రూ.కోట్లలో వ్యాపారం.. ప్రభుత్వానికి దక్కని ఆదాయం
సిరిసిల్లటౌన్: కార్మిక క్షేత్రం వస్త్ర, బీడీ పరిశ్రమలకు నిలయం. ఈ రెండు పరిశ్రమలను నమ్ముకొని జిల్లా కేంద్రంలో 90 శాతం కుటుంబాలు బతుకుతున్నాయి. వస్త్రపరిశ్రమలో అందరికీ ఒకే రకమైన కూలి డబ్బులు లభిస్తుండగా.. బీడీ పరిశ్రమలోనే వింత పరిస్థితులు ఉన్నాయి. బీడీకార్మికుల అవసరాన్ని బట్టి వర్దీ(నగదు చెల్లింపు) దందా వేళ్లూనుకుంది. బీడీలు అప్పజెప్పిన వెంటనే డబ్బులు ఇస్తున్నామని అసలు వేతనం కంటే తక్కువ చెల్లిస్తుంటారు. లైసెన్సులు లేకుండానే అక్రమంగా బీడీల తయారీ కేంద్రాలను నడుపుతున్నారు. రోజువారీ నగదు ఆశ చూపిస్తూ మహిళా కార్మికులతో బీడీలు చుట్టిస్తూ రూ.కోట్లలో దందా సాగిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో రూ.వందల కోట్ల జీరో వ్యాపారం సాగుతోంది. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కార్మికక్షేత్రంలో వర్ద్దీ దందాపై ఫోకస్ కథనం.
భువనగిరి, హైదరాబాద్ కేంద్రాలుగా దందా
జిల్లా వ్యాప్తంగా సుమారు 2లక్షల మంది కార్మికులు బీడీ తయారీతో ఉపాధి పొందుతున్నారు. వర్దీ బీడీలను భువనగిరి, హైదరాబాద్ ప్రాంతాల వ్యాపారులు తయారు చేయిస్తున్నారు. తంగళ్లపల్లి మండలంలో గుట్టుగా వర్దీ బీడీ వ్యాపార కేంద్రం నిర్వహిస్తున్నట్లు సమాచారం. లైసెన్స్‌డ్ కంపెనీలు వేయి బీడీలకు రూ. 275.25 చెల్లిస్తుండగా.. వర్దీ బీడీ యజమానులు వేయి బీడీలకు రూ.230 మాత్రమే చెల్లిస్తున్నారు. అయితే వీరు రోజువారీగా నగదు ఇస్తుండడంతో కార్మికులు సైతం తమ అవసరాలు తీరుతున్నాయనే ఉద్దేశంతో వర్దీ బీడీలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ తతంగంపై కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నా కార్మికశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
కార్మికులకు, ప్రభుత్వానికి నష్టం ఇలా..


