● జిల్లా ఉద్యాన అధికారి శరత్‌బాబు
బోయినపల్లి/ఎల్లారెడ్డిపేట/సిరిసిల్లఅర్బన్: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన మేర కురవడం లేదని రైతులు నీరు తక్కువ తీసుకునే ఆరుతడి పంటలు సాగుచేయాలని జిల్లా ఉద్యాన అధికారి శరత్‌బాబు కోరారు. మండలంలోని వెంకట్రావుపల్లిలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ ఇరువాల సంధ్య, తహసీల్దార్ షరీఫ్ మొయినొ ద్దీన్, ఎంఏవో ప్రణిత, ఏపీవో సబిత, ఏఈవో రవళి, కార్యదర్శి మల్లేశ్ పాల్గొన్నారు.
36 శాతం లోటు వర్షపాతం
ఎల్లారెడ్డిపేట మండలంలో 36 శాతం లోటు వర్షపాతం నమోదైందని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం తెలిపారు. ఈ వర్షం వరిపంటకు సరిపోదని పెసర, కంది, రాగులు, నువ్వులు, కూరగాయలు, ఆయిల్‌పామ్ సాగుచేసుకోవాలని సూచించారు. రాగులు, నువ్వుల విత్తనాలు టీవీకే వేములవాడలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఎంపీడీవో సత్తయ్య, తహసీల్దార్ సుజాత, మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్, సర్పంచ్ ఎలగందుల నర్సింలు, ఉపసర్పంచ్ బందారపు బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రగుడులో ఏఈవో రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇరిగేషన్‌శాఖ ఏఈ రాహుల్, స్థానిక కౌన్సిలర్ బూర బాలమల్లు, రైతులు పాల్గొన్నారు.
29న హుండీ లెక్కింపు
వేములవాడ: భీమన్నకు భక్తులు హుండీలలో సమర్పించిన కట్నాలను ఈనెల 29న భీమేశ్వర సదన్‌లో లెక్కించనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. ఆలయ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరుకావాలని సూచించారు.
ఇంటర్ విద్యార్థినికి ‘యూనివర్సల్’ ప్రశంసలు
చందుర్తి(వేములవాడ): చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో 470 మార్కులకు 468 సాధించిన శ్రీరాం శ్రీహితకు హైదరాబాద్‌కు చెందిన యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్ ప్రశంసాపత్రం అందించారు. హైదరాబాద్‌లో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థిని విజయానికి కృషిచేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సేవలను అభినందించారు.
విద్యార్థుల గర్జనకు తలొగ్గిన కేంద్రం
సిరిసిల్లటౌన్: దేశ యువత, విద్యార్థుల గర్జనకు కేంద్రం తలొగ్గిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో శనివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. విద్యార్థులు, ప్రతిపక్షాల డిమాండ్‌కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాగా మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్‌పై అవాక్కులు, చెవాక్కులు పేలడం మానుకోవాలని హితవు పలికారు. అటు కొడుకు భగీరథ్ కేసు, మరో వైపు కరీంనగర్‌లో వరుస చోరీల నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక బండి సంజయ్ కేటీఆర్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, న్యాలకొండ రాఘవరెడ్డి, కుంభాల మల్లారెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్, మ్యాన రవి, అడిచెర్ల సాయి, బూర బాలు, గెంట్యాల శ్రీనివాస్, రాములు, కొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కోతుల బెడదకు చెక్
బోయినపల్లి(చొప్పదండి): వెంకట్రావుపల్లిలో కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు సర్పంచ్ ఇరువాల సంధ్య–మహేందర్ ఆధ్వర్యంలో తీర్మానించారు. ఈక్రమంలో రోజుకు 50 నుంచి 60 కోతులను బోనులో బంధించి అడవిలో వదులుతున్నారు.


