కరీంనగర్–పిట్లం రహదారిని సిరిసిల్ల, కామారెడ్డి మీదుగా నిర్మించాల్సి ఉంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే.. అటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల వైపు నేరుగా జాతీయ రహదారి భాగ్యం కలుగుతుంది. జిల్లాకు రెండు జాతీయ రహదారులు వస్తాయి. ఫలితంగా వేములవాడ, సిరిసిల్ల పట్టణాలతోపాటు పల్లెలకు బహుముఖ ప్రయోజనం దక్కనుంది. రోడ్డు నిర్వహణ బాధ్యతలను నేషనల్ హైవే అథారిటీ పరిధిలో ఉండడంతో జిల్లాలో మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇంతటి ప్రాధాన్యత గల జాతీయ రహదారుల నిర్మాణాలపై ఇప్పటికై నా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టిసారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.


