వంశీ ఆత్మహత్యపై విచారణ జరిపించాలి
డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
సిరిసిల్లలో ప్రధాని, కేంద్రమంత్రి దిష్టిబొమ్మ దహనం
సిరిసిల్లటౌన్: నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై కోట్లాది మంది ఆందోళనకు దిగితే కేంద్ర ప్రభుత్వం మిన్నకుంటుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈమేరకు గురువారం సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు సూర దేవరాజు ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలమైందన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు, ప్రతిపక్ష నాయకులపై లాఠీచార్జీ చేయించడం అప్రజాస్వామ్యమన్నారు. ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన వంశీ తన ఆత్మహత్యకు ప్రధాని నరేంద్రమోదీ కారణమని సూసైడ్‌నోట్ రాయడంపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీగా వెళ్లారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళ, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాగుల జగన్, కౌన్సిలర్లు లింగంపల్లి గంగరాజు, బొద్దుల శ్రీనివాస్, కూరపాటి శ్రీశైలం, నాయకులు వేముల దామోదర్, ఎం.డి.రియాజ్, రాగుల రాములు, బొప్ప దేవయ్య, వెల్దండి దేవదాస్ పాల్గొన్నారు.


