ఈ ఫొటోలో అనాథలైన చిన్నారులు బాలసాని నందీశ్వర్, మనస్వినిలది ముస్తాబాద్. నెల క్రితం వీరి తండ్రి బాలసాని బాలరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం బాలరాజు భార్య కరుణ క్యాన్సర్‌తో మరణించింది. తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలయ్యారు. బాలరాజుపై ఆధారపడ్డ తల్లిదండ్రులు గౌరవ్వ, నారాగౌడ్‌ల రోదనలు నిత్యకృత్యమయ్యాయి. తల్లి లేని పిల్లలను, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాలరాజు.. ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం విలవిల్లాడుతోంది.
ఈ చిత్రంలో దీనంగా కనిపిస్తున్న వారి పేర్లు అనమేని రజిత, ఆమె అత్త మల్లవ్వ, కూతురు సహస్ర. వీరిది ముస్తాబాద్ మండలం పోతుగల్. రజిత భర్త ఆంజనేయులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. కూలీ పనులతోపాటు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించిన ఆంజనేయులు అప్పులు కూడా చేశాడు. అప్పులబాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకోగా.. కుటుంబ భారం రజితపై పడింది. దివ్యాంగురాలైన కూతురును ఇంటి వద్ద అత్త చూసుకుంటుండగా, కుమారుడు రాంచరణ్‌ను ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పించింది. ప్రభుత్వం సాయమందిస్తే ఽధైర్యంగా కుటుంబాన్ని పోషించుకుంటానంటోంది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారులు బండి వికాస్, వినయ్. వీరిది ముస్తాబాద్ మండలం ఆవునూర్. పెద్దకొడుకు వికాస్‌కు ఎప్‌సెట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. బీటెక్ ఫీజు చెల్లించేందుకు చేతిలో డబ్బులు లేకపోవడం.. అప్పుల బాధ తీవ్రం కావడంతో తల్లి రజిత వారం క్రితం ఆత్మహత్య చేసుకుంది. భర్త రవీందర్ దుబాయ్ వెళ్లగా సరైన ఉపాధి లభించలేదు. తల్లి లేకపోవడంతో ఇప్పుడు వికాస్, విజయ్‌ల బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.


