రాయికల్: రాయికల్ మండలం ఉప్పుమడుగు సహకార సంఘం సీఈవో సుతారి తిరుపతి (56) గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన తిరుపతి ఉదయం విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు జగిత్యాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. తిరుపతి మృతిపై జిల్లా సహకార సంఘ అధికారి మనోజ్, డీజీఎం సత్యప్రసాద్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, సహకార సంఘం సీఈవోలు సంతాపం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
విషజ్వరంతో బాలుడి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన కాముని వరుణ్‌తేజ (6) విష జ్వరంతో గురువారం మృతిచెందాడు. గ్రామానికి చెందిన కాముని అర్జయ్య, సరిత చిన్న కుమారుడు వరుణ్ తేజ యూకేజీ చదువుతున్నాడు. బుధవారం జ్వరం రావడంతో తల్లి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు కరీంనగర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. కరీంనగర్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అదేకాలనీకి చెందిన మరో బాలిక విషజ్వరంతో అపస్మారకస్థితికి వెళ్లింది. జిల్లా వైద్యాధికారి సుజాత, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేపట్టారు.
ఆటో పైనుంచి పడి కార్మికుడు మృతి
కరీంనగర్‌క్రైం: నగరంలో డిజిటల్ నేమ్‌బోర్డు ట్రాలీ ఆటోలో తరలిస్తుండగా ఓ కార్మికుడు కిందపడి చనిపోయాడు. వన్‌టౌన్ పోలీసుల వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన కామారెడ్డి సురేందర్(45) కోతిరాంపూర్‌లో నివాసముంటూ స్క్రాప్‌షాపులో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం విధులకు వెళ్లాడు. 11గంటల సమయంలో ఆటోట్రాలీలో భారీ డిజిటల్ నేమ్‌బోర్డు తీసుకెళ్లే క్రమంలో కోతిరాంపూర్‌లో డ్రైవర్ చింతల సిద్దార్థ్ వాహనాన్ని నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపాడు. సురేందర్ ఆటోలోంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.


