విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ తీర్ధయాత్రల్లో భాగంగా కరీంనగర్ 1 డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 26న అరుణాచలం యాత్రకు బయలుదేరుతుందని కరీంనగర్ 1డిపో మేనేజర్ విజయమాధురి తెలిపారు. కరీంనగర్ బస్టాండ్ నుంచి సాయంత్రం 4 గంటలకు బస్సు బయలుదేరి కాణిపాకం, కంచి, అరుణాచలం, శ్రీరంగం, మదురై, రామేశ్వరం, జోగులాంబ దర్శనాలు చేసుకుని ఈనెల 31న సాయంత్రం వరకు కరీంనగర్ చేరుకుంటుందని ఆమె పేర్కొన్నారు. పెద్దలకు రూ.7,300, పిల్లలకు రూ.5,475గా టికెట్ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 7382849352, 9959225920 నంబర్లలో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.
24 గంటల్లోనే చోరీ కేసు ఛేదన
● నిందితుడి అరెస్ట్.. రూ.1.25 లక్షలు స్వాధీనం
కరీంనగర్‌క్రైం: నగరంలోని త్రీ టౌన్ పరిధిలో జరిగిన చోరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1,25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం తులసీనగర్, వావిలాలపల్లికి చెందిన తోట రోహిత్ ఈ నెల 22న తన తల్లితో కలిసి డిమార్ట్‌కు షాపింగ్‌కు వెళ్లాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాలో దాచిన రూ.4.80 లక్షల నగదు అపహరించి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని విశ్లేషించి నిందితుడు దేవనవేణి మహేశ్‌గా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని, రూ.1.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరచి రిమాండ్ చేశారు. కేసును ఛేదించిన త్రీటౌన్ ఎస్సై బి.చేరాలు, కానిస్టేబుల్ కె.ప్రశాంత్‌ను సీఐ తిరుమల్ అభినందించారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
● రూ.43,540 నగదు స్వాధీనం
మంథని: మంథని మండలం గుంజపడుగు గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులతో పాటు రూ.43,504 నగదు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు ఇతర వస్తువులను మంథని పోలీస్‌స్టేషన్ అధికారులకు అప్పగించి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
వాహనాల వేలం
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లోని పోలీస్ వాహనాలకు సంబంధించిన పాత స్పేర్ పార్ట్స్, టైర్లు, బ్యాటరీలు, ఉపయోగించిన ఇంజిన్ ఆయిల్‌లకు ఈనెల 27న వేలం పాట నిర్వహిస్తున్నట్లు రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఆసక్తి గల వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. వివరాల కోసం ఎంటీవో మల్లేశం 8712656616 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


