తంగళ్లపల్లి(సిరిసిల్ల): భూగర్భ జలమట్టాలను పెంపే లక్ష్యంగా నేరెళ్ల పంచాయతీలో ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పొన్నం లక్ష్మ ణ్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి(డీఆర్డీవో) లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వర్షపు నీరు వృథా కాకుండా బోరుబావుల రీచార్జ్ నిర్మాణాలు, మ్యాజిక్ పిట్స్, ఫామ్‌పాండ్స్, పర్కోలేషన్ ట్యాంకులు విస్తృతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీడీ నరసింహులు, ఇన్‌చార్జి ఏపీవో రాజనర్సయ్య, హెచ్‌ఆర్ రాపోలు నాగరాజు, కార్యదర్శి సంతోష్‌కుమార్, ఉపసర్పంచ్ రాజమణి పాల్గొన్నారు.
భీమన్న సేవలో జూనియర్ సివిల్ జడ్జి
వేములవాడ: భీమన్నను ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి జూనియర్ సివిల్ జడ్జి లిఖిత కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆలయ పర్యవేక్షకులు జి.శ్రీనివాస్‌శర్మ, ప్రొటోకాల్ పర్యవేక్షకులు పెరుక శ్రీనివాస్ పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో మైసమ్మ పండుగ
సిరిసిల్లటౌన్: మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుల ఆధ్వర్యంలో మైసమ్మతల్లి బోనాల పండుగను బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి పాల్గొన్నారు. స్థానిక కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజపూర్ణచందర్, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
సర్వేకు సహకరించాలి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): జాతీయ గణాంకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్–2026)’కు ప్రజలు సహకరించాలని ఉమ్మడి జిల్లా గణాంకశాఖ అధికారి గుర్రం శ్రీనివాస్‌గౌడ్ కోరారు. మండలంలోని గోపాలరావుపల్లె గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గుండు ప్రేమతో కలిసి బుధవారం సర్వే కరపత్రాలను విడుదల చేశారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఉపాధి, నిరుద్యోగం, కార్మికశక్తి భాగస్వామ్యంపై విశ్వసనీయ గణాంకాలను రూపొందించేందుకే ఈ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఉపసర్పంచ్ గొట్ల ఎల్లయ్యయాదవ్, పంచాయతీ కార్యదర్శి గంగుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ స్టడీసర్కిల్‌కు దరఖాస్తులు ఆహ్వానం
సిరిసిల్ల: బీసీ స్టడీసర్కిల్‌లో నిరుద్యోగ యువతకు ఉచితంగా పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి బుధవారం తెలిపారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్–1, 2, 3, 4 పరీక్షలతోపాటు బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేరిక్రూట్‌మెంట్, పోలీస్ నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని కోరారు. వివరాలకు 08723–223004లో సంప్రదించాలని తెలిపారు.


