ప్రత్యామ్నాయ పంటలు వేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

Jul 23 2026 2:12 AM | Updated on Jul 23 2026 2:12 AM

● ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల/చందుర్తి/వేములవాడఅర్బన్‌: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కోరారు. చందుర్తి మండలం మల్యాలలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై బుధవారం నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు స్వల్పకాలిక పంటలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్న, నూనెగింజలు సాగు చేయాలని సూచించారు. సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో ప్రాజెక్టుల్లో నీరు అడుగుకు చేరుకుందని, భూగర్భ జలాలు అడుగంటి పోయాయని తెలిపారు. ప్రతీ ఇంట్లో ఇంకుడుగుంతలు, బోర్‌వెల్‌ రీచార్జీలు, రైతులు పొలాల వద్ద ఫామ్‌పాండ్స్‌, బోర్‌వెల్‌ రీచార్జీ పనులు చేయాలని సూచించారు. రుద్రంగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, సర్పంచ్‌ మందాల శారద, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, జెడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ఉద్యావనశాఖ అధికారి శరత్‌బాబు, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి దయాకర్‌, ఆర్డీవో కుమారి, తహసీల్దార్‌ భూపతి, ఎంపీడీవో రాధ పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి

మండలంలోని మల్యాలలో ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్‌ పరిశీలించి త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు బిల్లులు ఎంత మేరకు వచ్చాయో తెలుసుకున్నారు.

ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్‌ పనులు పరిశీలన

మూడపల్లిలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పనులను కలెక్టర పరిశీలించారు. ఏ గదులు ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసుకున్నారు. కూలీల సంఖ్య పెంచుకొని గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మూడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు.

భూముల రీసర్వే కచ్చితత్వంతో చేయాలి

భూముల రీసర్వే కచ్చితత్వంతో చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సూచించారు. వేములవాడ మండలం చంద్రగిరిలో భూభారతి కింద రోవర్‌ యంత్రంతో భూముల రీ సర్వే పనులు కొనసాగుతుండగా కలెక్టర్‌ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, ఏడీ సర్వే శ్రీనివాస్‌, తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌ ఉన్నారు.

నాణ్యతతో సమాచారం సేకరించాలి

జిల్లాలో ఫీల్డ్‌ ఫంక్షనరీలు నాణ్యతతో సమాచారం సేకరించాలని జిల్లా ప్రిన్సిపల్‌ సెన్సస్‌ ఆఫీసర్‌, కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జనగణన–2027కు సంబంధించిన సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ ఫీల్డ్‌ ఫంక్షనరీలకు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ డీసీహెచ్‌ బీ పోర్టల్‌, మొబైల్‌ అప్లికేషన్‌ను ఉపయోగించి విలేజ్‌ డైరెక్టరీ(వీడీ), టౌన్‌ డైరెక్టరీ(టీడీ) సమాచారాన్ని సమయానుకూలంగా నాణ్యతతో సేకరించాలన్నారు. విలేజ్‌ డైరెక్టరీ సమాచారాన్ని 2025 డిసెంబరు 31ని ప్రామాణిక తేదీగా తీసుకుని, రెవెన్యూ గ్రామాల వారీగా మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా జీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు ఆఫీసర్ల పర్యవేక్షణలో సేకరించాలని ఆదేశించారు. ఈ సమాచార సేకరణ ప్రక్రియ ఆగస్ట్‌ 10 నుంచి సెప్టెంబరు 8వ వరకు నిర్వహించాలన్నారు. విలేజ్‌ డైరెక్టరీలో విద్య, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, రవాణా, కమ్యూనికేషన్‌, బ్యాంకింగ్‌, రుణ సదుపాయాలు తదితర వివరాలు నమోదు చేయాలన్నారు. సీపీవో పీ.బీ.శ్రీనివాసాచారి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement