వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో మూడు నిమిషాల్లో రూ.3.50లక్షలు చోరీకి గురయ్యాయి. బైక్ ట్యాంక్ కవర్‌లో పెట్టిన డబ్బులను నిమిషాల్లో మాయం చేశారు. ఈ సంఘటన వేములవాడలో బుధవారం కలకలం రేపింది. వేములవాడ రూరల్ మండలం బాలరాజ్‌పల్లికి చెందిన నాగరాజు తన ఇంటి నుంచి రూ.2.40లక్షలు తీసుకొని వేములవాడకు వచ్చారు. వేములవాడలోని కేడీసీసీ బ్యాంకు నుంచి మరో రూ.1.10 లక్షల నగదు డ్రా చేసుకున్నాడు. మొత్తం డబ్బులను తన బైక్ ట్యాంక్ కవర్‌లో పెట్టుకొని పట్టణంలోని విద్యానగర్‌లోని మాజీ సర్పంచ్ నేదూరి రాజు నివాసానికి చేరుకున్నారు. బైక్‌ను ఇంటి ముందు నిలిపి ఇంట్లోకి వెళ్లాడు. అప్పటికే నాగరాజును అనుసరిస్తున్న ముగ్గురు దొంగలు రెండు బైక్‌లపై అక్కడికి చేరుకొని బైక్ ట్యాంక్ కవర్‌లో ఉన్న రూ.3.50 లక్షలను తీసుకొని పరారయ్యారు. ఇంట్లో నుంచి వచ్చిన నాగరాజు నగదు లేకపోవడాన్ని గమనించి షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చోరీకి గురైన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటీజీని పరిశీలించారు. ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులోని తల్లగడ ప్రాంతానికి చెందిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా పని కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
వేములవాడలో బైక్ నుంచి డబ్బులు చోరీ
ఆంధ్రా–తమిళనాడు సరిహద్దు ముఠా పనిగా అనుమానం
రంగంలోకి పోలీసులు


