● తాగొచ్చి గొడవ చేస్తున్నాడని దాడి
● చికిత్స పొందుతూ మృతి
ముస్తాబాద్(సిరిసిల్ల): తాగొచ్చి గొడవ చేస్తున్నాడని తండ్రిపై తల్లీకొడుకులు దాడి చేయడంతో మృతిచెందాడు. ఈ సంఘటన ముస్తాబాద్ మండలంలో కలకలం రేపింది. సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వర్‌రావు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని డబుల్‌బెడ్‌రూమ్ కాలనీలో ఉంటున్న మహ్మద్ షాదుల్(45) ఈనెల 16న మద్యం తాగి ఇంటికొచ్చాడు. గొడవ చేస్తున్నాడని అతని కొడుకు అస్రఫిన్ బ్యాట్‌తో దాడి చేయగా, భార్య హఫీజా కర్రతో కొట్టింది. తల, మెడకు తీవ్ర గాయాలైన షాదుల్‌ను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్సై జ్యోతి విచారణ చేపట్టారు. రోజు మద్యం సేవించి గొడవ చేస్తున్నాడని, వేధింపులు తాళలేకనే తల్లీకొడుకులు దాడి చేసి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తెలింది.


