వేములవాడ: రాజన్న సేవలో తరించాలన్న అర్చకుల కల సాకారమైంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత దేవాదాయ ధర్మాదాయశాఖ చేపట్టిన భారీ నియామకాల్లో వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి 21 పోస్టులు కేటాయించారు. 11 పరిచారకులు, 2 వైష్ణవ అర్చకులు, 2 తమ్మల అర్చకులు, ఒక అసిస్టెంట్ కుక్, ఒక శృతి వాద్యకారుడు, 2 డోలు వాద్యకారులు, 2 సన్నాయి వాద్యకారుల పోస్టులు ఉన్నాయి. ఎంపికై న 21 మంది అభ్యర్థులు హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నియామక పత్రాలను అందుకున్నారు. ఆలయాల్లో సిబ్బంది కొరతను అధిగమించడంతోపాటు అర్చక వ్యవస్థను బలోపేతం చేయడం, సంప్రదాయ వాద్య కళాకారులకు ప్రోత్సాహం అందించడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
బస్సులో బంధుగణంతో..
హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, భోజన వసతి కల్పించింది. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. దేవస్థానం ఈవో రమాదేవి ఎంపికై న అభ్యర్థులను అభినందిస్తూ, రాజన్న సేవలో అంకితభావంతో పనిచేయాలన్నారు.
21 మందికి ఉద్యోగాలు
14 ఏళ్ల తర్వాత కల సాకారం
హైదరాబాద్‌లో నియామకపత్రాలు అందజేత


