● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి(చొప్పదండి): కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని మల్కాపూర్, అనంతపల్లి, కోరెం, స్తంభంపల్లి, విలాసాగర్, కొదురుపాక గ్రామాల్లో శనివారం వీవోఏ మహిళా సంఘం భవనాలకు శంకుస్థాపన చేశారు. బోయినపల్లిలో వ్యవసాయ గోదాం నిర్మాణానికి భూమిపూజ చేసి, పవర్‌లూమ్ మ్యాక్స్ సొసైటీలో బతుమ్మచీరెల కేంద్రాన్ని సందర్శించారు. డీపీవో జయశీల, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్‌యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సువీన్‌యాదవ్, సెస్ డైరెక్టర్ సుధాకర్, మాజీ డీసీఎమ్మెస్ చైర్మెన్ ముదిగంటి సురేందర్‌రెడ్డి, ఏపీఎం పవన్‌కుమార్, డిపో మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బస్సు నడిపిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
వేములవాడ నుంచి అనంతపల్లి, కోరెం గ్రామాల మీదుగా జగిత్యాల వెళ్లే నూతన బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సును నడిపారు.
సిరిసిల్ల: రేషన్‌కార్డుదారులు జూలై నెలాఖరులోగా ఈ–కేవైసీ పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు శనివారం తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్‌షాపుల్లో ఈ–కేవైసీ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సాధారణ లబ్ధిదారులతోపాటు పోర్టబిలిటీ ద్వారా రేషన్‌సరుకులు పొందుతున్న వారు తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేయాలని సూచించారు.
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలో టాప్ మార్కులు సాధించే విద్యార్థులను విమానంలో తిరుపతి తీసుకెళ్తానని గర్జనపల్లి సర్పంచ్ రాకేశ్‌గౌడ్ ప్రకటించారు. గర్జనపల్లిలోని హైస్కూల్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఈమేరకు మాట్లాడారు. గర్జనపల్లిలో చదువుకుని ఎంతో మంది ఉన్నత పదవుల్లో స్థిరపడ్డారని, వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు చదవాలని కోరారు. మండల స్థాయిలో గ్రామం పేరు నిలబెట్టే విద్యార్థులను విమానంలో తిరుపతి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
మధ్యాహ్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న వంటకార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట ఎమ్మార్సీ ఎదుట శనివారం ఆందోళన చేశారు. కొత్తబస్టాండ్ నుంచి ఎమ్మార్సీ ఆఫీస్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం ఎంఈవో కృష్ణహరికి వినతిపత్రం ఇచ్చారు.


