● తాగునీటికి ఇబ్బందులు రానీయొద్దు ● ఎల్‌నినో ప్రభావంపై కలెక్టర్ గరీమా అగ్రవాల్ సమీక్ష
సిరిసిల్ల: జిల్లాలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్‌లో అధికారులతో ఎల్‌నినో ప్రభావం, నీటినిల్వలపై శనివారం సమీక్షించారు. ఎగువ మానేరులో 0.612 టీఎంసీలు, మల్కపేట రిజర్వాయర్‌లో 1.33 టీఎంసీలు, అన్నపూర్ణలో 1.45 టీఎంసీలు, మిడ్ మానేరులో 7.44 టీఎంసీల నీరు ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతం నమోదైందని, ప్రస్తుతం రిజర్వాయర్లలోని నీటిని తాగునీటి కోసం ఉపయోగించాలని స్పష్టం చేశారు. రైతులు వరి బదులుగా స్వల్పకాలిక కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు, ఆయిల్‌పామ్ సాగుచేయాలని సూచించారు.
బోర్‌వెల్స్ సిద్ధం చేయండి
అన్ని గ్రామపంచాయతీల పరిధిలో బోర్‌వెల్స్ రీచార్జ్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జెడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, డీపీవో జయశీల, ఇరిగేషన్ అధికారి దయాకర్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, డీఏవో అఫ్జల్‌బేగం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్ పాల్గొన్నారు.
జలాశయాల నీటి నిల్వలపై ఆరా
తాగునీటికి ఇబ్బందులు కలగకుండా సరఫరా చేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలపై ఆరా తీశారు. ఎస్సారెస్పీ నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్, మూలవాగు, మానేరువాగు వరదనీటితోపాటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ చేయడం ద్వారా మధ్యమానేరు జలాశయాన్ని నింపడం జరుగుతుందని తెలిపారు. ఎగువ మానేరుకు మల్లన్న సాగర్, కూడవెల్లి, పాల్వంచవాగుల ద్వారా నింపనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. ఈఈ దయాకర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈఈ సంతు ప్రకాశ్‌రావు, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ అన్వర్, ఇంట్రా ఈఈ సుమలత, డీఈ ప్రశాంత్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ నిర్మాణాల్లో వేగం పెంచాలి
జిల్లావ్యాప్తంగా పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను వేగవంతంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆమె శనివారం టెలీకాన్ఫరెన్స్‌లో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీపీవో జయశీల పాల్గొన్నారు.
సమగ్ర నివేదికలతో రావాలి
జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ప్రత్యేకాధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశాలకు ఆయా శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో రావాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం రాత్రి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ, ఉద్యానవన, నీటి పారుదల, విద్యుత్, మిషన్‌భగీరథ, పశుసంవర్థక, వైద్య ఆరోగ్య, ఇతర శాఖల అధికారులు వివరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.


