● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్ల కొనుగోళ్లకు ఆధార్‌కార్డుతోపాటు పూర్తి వివరాలు నమోదు చేయాలని, దొంగిలించిన ఫోన్లు కొంటే చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్ బీ గీతే హెచ్చరించారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో మొబైల్ ఫోన్ల వ్యాపారులు, రిపేరు షాపుల నిర్వాహకులతో శనివారం సమావేశమయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో వివిధ సందర్భాల్లో దొంగలించబడిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ అమ్మడానికి, మార్పిడి చేయడానికి వచ్చిన వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోన్ తెచ్చిన వారి ఆధార్ కార్డ్ జిరాక్స్‌తోపాటు పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. మొబైల్ ఫోన్ దొంగలను పట్టించడంలో, వారి సమాచారాన్ని అందించడంలో సహకరించిన షాప్ యజమానులకు ప్రశంసాపత్రం అందిస్తామన్నారు. అందరి సహకారంతోనే మొబైల్ ఫోన్స్ రికవరీలో దక్షిణ భారతదేశంలో మొదటి స్థానాన్ని వరుసగా మూడోసారి నిలిచామన్నారు. ఐటీ కోర్ ఎస్సై కిరణ్‌కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేశ్, మొబైల్ షాప్స్ యజమానులు పాల్గొన్నారు.


