● కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని కార్గిల్ లేక్ బండ్ సుందరీకరణ పనులు గడువులోగా, నాణ్యతతో పూర్తి చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. అమృత్ 2.0లో రూ.1.32 కోట్లతో కార్గిల్ లేక్ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గితే, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. లేక్ పరిసరాలను పరిశీలించారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు కార్గిల్ లేక్ పర్యాటక కేంద్రంగా మారాలన్నారు. కార్గిల్‌లేక్ లోకి మురుగునీరు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్‌రావు, డీఎస్పీ కె.నాగేంద్రచారి, తహసీల్దార్ మహేశ్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, కౌన్సిలర్ ఎర్రం వెంకట్రాజం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పాల్గొన్నారు.
డ్రోన్ ప్రదర్శనను తిలకించిన మంత్రి
పట్టణ శివారులోని మల్లన్నగుట్ట వద్ద భారత్ సోలార్, డ్రోన్స్ ఆఫీస్‌ను కేంద్ర మంత్రి సంజయ్‌కుమార్ ప్రారంభించారు. డ్రోన్స్ పని తీరును పరిశీలించారు. కేంద్ర మంత్రిని పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షుడు డాక్టర్ గాజుల బాలయ్య సత్కరించారు. మార్కండేయ ఆలయ అభివృద్ధిని నిధులు మంజూరు చేయాలని కోరారు.


