జిల్లా జనాభా 5,52,037 కాగా.. పురుషులు 2,74,109, మహిళలు 2,77,928. ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1,014 మంది మహిళలు ఉన్నారు. కానీ బాల, బాలికల నిష్పత్తిని పరిశీలిస్తే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆరేళ్లలోపు పిల్లల్లో బాలు రు 25,099 మంది ఉంటే బాలికలు 23,652 మందే ఉన్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య 1,447 తక్కువగా ఉంది. జిల్లాలో భ్రూణహత్యలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి. అందుకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. కోనరావుపేట మండలంలో వెయ్యి మంది అబ్బాయిలకు 886 మంది అమ్మాయిలు ఉన్నారు. బోయినపల్లిలో 917 మంది ఉన్నారు. అత్యధికంగా ఇల్లంతకుంట మండలంలో వెయ్యి మంది అబ్బాయిలకు 988 మంది అమ్మాయిలు ఉన్నారు. దీన్ని బట్టి జిల్లాలో భ్రూణహత్యలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. జిల్లా వైద్యశాఖ అధికారులు స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టినా గుట్టుగా అబార్షన్లు జరుగుతున్నాయి. ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోటిక్ టెక్నిక్స్(పీసీ పీఎన్‌డీటీ) ప్రొహిబిషన్ ఆఫ్ సెక్స్ సెలక్షన్ యాక్ట్ 1994, అండ్ రూల్స్ 1996 ప్రకారం తల్లి కడుపులోని పసి గుడ్డు లింగ నిర్ధారణను ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్లు వెల్లడించరాదు. గర్భంలో పాప ఎదుగుదల, లోపాలు తెలుసుకునేందుకు స్కానింగ్ ద్వారా పరిశీలించాలి. కానీ కొందరు డాక్టర్లు డబ్బుకు కక్కుర్తిపడి కడుపులోని పాప ఆడో, మగో చెప్పడంతో అబార్షన్లకు అవకాశమిస్తోంది. స్కానింగ్ సెంటర్లు, జనటిక్ సెంటర్లు, రేడియాలజిస్ట్‌లు తల్లి కడుపులోని బిడ్డ సెక్స్‌ను చెప్పడం జరుగుతోంది. ఇది నేరమని తెలిసినా పైసల కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు.


