వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామం వద్ద గోవధ కోసం అక్రమంగా తరలిస్తున్న కోడెను వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు శుక్రవారం అడ్డుకున్నారు. కోడెను జగిత్యాల నుంచి వేములవాడకు ఆటోలో తీసుకొస్తుండగా పట్టుకుని రాజన్న గోశాలకు తరలించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాయకులు గడప కిశోర్‌రావు, నందగిరి రాహుల్, రాజేందర్, మహేశ్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
నిమ్మపల్లిలో మూడిళ్లలో దొంగతనానికి యత్నం
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో శుక్రవారం దొంగతనానికి యత్నించారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. నిమ్మపల్లికి చెందిన ఇద్దగిరి మల్లేశం గల్ఫ్‌కు వెళ్లగా భార్య సుజాత బంధువుల ఇంటికి వెళ్లింది. శుక్రవారం ఇంటికి తిరిగి రాగా తాళం పగులగొట్టి ఉంది. అయితే ఎలాంటి వస్తువులు చోరీకి గురికాలేదు. అదే గ్రామానికి చెందిన ఇద్దగిరి మల్లయ్య(తండ్రి చిన్నమల్లయ్య), ఇద్దగిరి మల్లయ్య( తండ్రి రాజయ్య) ఇళ్లల్లోనూ చోరీకి యత్నించారు. కోనరావుపేట పోలీసులు విచారణ చేపడుతున్నారు.
పుస్తెలు దొంగలించిన ఇద్దరి రిమాండ్
సిరిసిల్ల క్రైం: జిల్లా కేంద్రంలోని సాయినగర్‌లో మహిళ మెడలోని బంగారు పుస్తెలు దొంగిలించిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తుర్కాశినగర్‌కు చెందిన సయ్యద్ మౌలానా, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన మంగూరు ప్రకాశ్‌యాదవ్‌ను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి బంగారు పుస్తెలు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. ఈనెల 17న రాత్రి సాయినగర్ ఏరియాలో మేర్గు లత ఇంటి గేటు బయటకు రాగా, ఇద్దరు వ్యక్తులు అడ్రస్ అడిగినట్లు నటించి ఆమె మెడలోని బంగారు పుస్తెలను లాక్కొని, బైక్‌పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. సయ్యద్ మౌలానా, మంగూరు ప్రకాశ్‌యాదవ్‌ను రగుడు చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 4.4 గ్రాముల బంగారు పుస్తెలు, ఒక ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎగువమానేరులో యువకుడి మృతదేహం
● కామారెడ్డి జిల్లావాసిగా గుర్తింపు
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌కు చెందిన దుంపటి వినయ్‌కుమార్(32)గా గుర్తించారు. మానేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, మృతునికి నెల రోజుల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. గత నెల కవలల దినోత్సవం రోజున పెళ్లయినట్లు సమాచారం


