● బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ● సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం ● ముస్లింలకు ఇఫ్తార్ విందు
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.44కోట్లు మంజూరు చేస్తే.. వాటిని ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు మోకాలొడ్డిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఐదోవార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని సోమవారం ప్రారంభించి మాట్లాడారు. తాను ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదన్నారు. ప్రజల మనసు దోచుకోవాలంటే అభివృద్ధికి తానిచ్చిన రూ.40 కోట్లకు రూ.80 కోట్లు ఇవ్వాల్సి ఉండేదన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని చూసి సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండంగా గెలిపించారన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, వైస్‌చైర్మన్ దార్ల సందీప్, కమిషనర్ ఎం.ఎ.ఖదీర్‌పాషా, స్థానిక కౌన్సిలర్ దార్నం అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి పాల్గొన్నారు.
సర్వేయర్ల వినతిపత్రం
విద్యావంతులైన లైసెన్స్‌డ్ సర్వేయర్లను రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని, తమకు న్యాయం కావాలంటూ సర్వేయర్లు కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన హామీలతో తాము ప్రైవేట్ ఉద్యోగాలను వదిలి వస్తే ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కనీస వేతనం ఇవ్వకుండా ఎకరానికి రూ.10 కమీషన్ ఇస్తామనడం విద్యావంతులను అవమానించడమేనన్నారు. లైసెన్స్‌డ్ ల్యాండ్ సర్వేయర్ జిల్లా అధ్యక్షుడు కావటి మహిపాల్ పాల్గొన్నారు.
ఇఫ్తార్‌విందులో కేటీఆర్
ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్‌విందులో కేటీఆర్ పాల్గొన్నారు. బీవైనగర్‌లోని షాదిఖానాలో నిర్వహించిన విందులో ముస్లింలతో కలిసి హాజరయ్యారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఎం.డి. సత్తార్, సోహైల్, యూసుఫ్ పాల్గొన్నారు.


