చెరువులకు చేరుతున్న ‘చేపలు’
జిల్లాలో చేప పిల్లల పంపిణీ ఇలా..
● ఆలస్యమైనా చిగురించిన మత్స్యకారుల ఆశలు ● 456 చెరువుల్లో కోటిన్నర చేప పిల్లల పంపిణీకి శ్రీకారం
గంభీరావుపేట(సిరిసిల్ల): ఆలస్యంగానైనా.. ఎట్టకేలకు చెరువుల్లోకి చేప పిల్లలు చేరుతున్నాయి. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వంద శాతం రాయితీపై ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వానాకాలం మొదట్లో ప్రారంభించాల్సి ఉండగా నవంబర్‌లో చెరువుల్లో చేపలు విడుదల చేసే కార్యక్రమాన్ని మత్స్యశాఖ అధికారులు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 456 చెరువులు, ప్రాజెక్టులు, కుంటల్లో కోటిన్నర చేప పిల్లలు విడుదల చేయాలని కార్యాచరణ రూపొందించి నాలుగు రోజుల క్రితం ప్రారంభించారు. ఇప్పటివరకు 24లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణలో చేప పిల్లల విడుదల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈసారి చేప పిల్లలు ఆలస్యంగా రావడం వల్ల మత్స్యకారుల్లో కాస్త ఆందోళన నెలకొన్నప్పటికీ చేప పిల్లల పంపిణీ మొదలు కావడంతో వారిలో ఆశలు చిగురించాయి.
మత్స్యకారులకు చేతినిండా ఉపాధి
ముస్తాబాద్: మత్స్య కార్మికులందరికీ చేతినిండా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఫిషరీస్ డెవలప్‌మెంట్ జిల్లా చైర్మన్ చొప్పరి రామచంద్రం అన్నారు. ముస్తాబాద్ మండలం బందనకల్‌లోని ఊర చెరువు, రేగుల చెరువులో 2 లక్షల చేప పిల్లలను శుక్రవారం వదిలారు. జిల్లాలో మత్స్యకార్మికులందరికీ సొసైటీల ద్వారా ఉపాధి కల్పించేందుకు చేప పిల్లల పెంపకం చేపట్టిందన్నారు. జిల్లాలో 555 చెరువుల్లో ప్రస్తుతం సమృద్ధిగా నీరు ఉందని, చేపల పెంపకానికి ఇదే సరైన సమయమని తెలిపారు. ఎగువ, మధ్య మానేరు ప్రాజెక్టుల్లో చేపల పెంపకానికి ప్రణాళిక రూపొందించామని అన్నారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, జిల్లా ఫిషరీస్ అధికారి సౌజన్య, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, ఏఈవో రేవతి, ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్, కార్తీక్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జెల్ల మల్లయ్య, పండరి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
మండలం చెరువులు చేప పిల్లలు
గంభీరావుపేట 52 22,33,388
ముస్తాబాద్ 35 9,44,877
సిరిసిల్ల 17 3,77,446
తంగళ్లపల్లి 38 6,59,99
వీర్నపల్లి 18 3,53,766
ఎల్లారెడ్డిపేట 45 8,99,81
చందుర్తి 33 8,37,756
కోనరావుపేట 55 17,03,465
వేములవాడ 25 4,10,427
వేములవాడ రూరల్ 27 4,89,019
బోయినపల్లి 36 33,08,878
ఇల్లంతకుంట 68 25, 26,837


