
స్థానిక సమరానికి బీజేపీ సై
● ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం ● కరీంనగర్, సిరిసిల్ల జెడ్పీ పీఠాలను కై వసం చేసుకుంటాం ● కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల కోసం, కాషాయ జెండాను నమ్ముకున్న కార్యకర్తలను గెలిపించడం కోసం ఢిల్లీ ఎన్నికల్లోనే కాదు గల్లీ ఎన్నికల్లోనూ కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలపై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం అని స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే సర్వే టీంలు ఒక దఫా సర్వే పూర్తి చేశాయని, రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో సర్వే టీంలు రంగంలోకి దిగాయని అన్నారు. రిజర్వేషన్ల మూలంగా టిక్కెట్లు రాకపోయినా నిరాశ చెందవద్దని... వారికి పార్టీలో, ఇతరత్రా పదవుల్లో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.