
దావత్ షురూ!
గెలుపే లక్ష్యంగా ఆశావహుల ఆఫర్
ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు ఖరారు
గెలుపే లక్ష్యంగా పలువురు నేతల కసరత్తు
ఎన్నికలు, దసరా కలిసిరావడంతో పల్లెల్లో జోష్
మద్యం, మాంసం పంచేందుకు సిద్ధమైన గ్రామాల నాయకులు
కుల సంఘాలకు ఆఫర్లు
‘తమ్మీ.. మన కులపెద్ద మనుషులతో మాట్లాడు.. దసరాకు యాటను కొనిస్త.. మీ కులసంఘంలోని ప్రతీఇంటికి పోగు చేరేలా నువ్వే చూసుకో.. ముఖ్యమైనోళ్లు ఉంటే చెప్పు.. వారికి క్వార్టర్ మందు కూడా ఇద్దాం.. ఎన్నికలప్పుడు ఓటుకు పైసలు గూడా ఇచ్చుడే.. కానీ గంపగుత్తగా ఓట్లు నాకే పడాలే.. మల్లా ఎవరికీ మాటివ్వకు’
– ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ స్థానం ఆశావహుడి ఆఫర్
‘అన్నా.. పార్టీలో కొన్నేళ్లుగా కష్టపడి పనిచేస్తున్న.. అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీతోనే ఉన్న.. ఇప్పుడు రిజర్వేషన్ కలిసొచ్చింది.. ఎమ్మెల్యే కూడా నాకు టికెట్ కన్ఫర్మ్ చేసిండు.. ఎంతఖర్చయినా పర్లేదు పెడత.. నాకు ఫుల్‌సపోర్ట్ జేస్తే.. జెడ్పీటీసీగా గెలుస్త’
– ముఖ్య నేతలతో దావత్ ఇస్తూ ఓ జెడ్పీటీసీ ఆశావహుడి వేడుకోలు
సాక్షి పెద్దపల్లి:
ఎన్నికలు అంటే సుక్క.. దసరా అంటే ముక్క.. ఇప్పుడు ఈ రెండు పెద్దపండుగలు కలిసే వచ్చా యి. పైగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పండుగ సందర్భంగా ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఆశావహులు ప్రలో భాలకు తెరతీస్తున్నారు. గ్రామాల్లో కులపెద్దలు, నలుగురిని ప్రభావితం చేసే కార్యకర్తలను మద్యంతో దావత్‌లు షురూ చేశారు. దసరా సందర్భంగా ఓటర్లకు మటన్‌పోగులు పంచిపెడుతూ ఖుషీ చేసేందుకు గ్రౌండ్‌వర్క్ చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరిగే పల్లెల్లో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరికొందరు దసరా పండుగ రోజు రావణవధ కార్యక్రమాన్ని తమ సొంత డబ్బుతో భారీఎత్తున నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు.
మామూళ్లతో ముచ్చెముటలు
తెలంగాణలో అతి పెద్దపండుగ దసరాకు నేతలు, ఊరులో పలుకుబడి కలిగినవారు తమ అనుచరులకు, తమ వద్ద పని చేసుకునేవారికి పండుగ సందర్భంగా ఎంతోకొంత దావత్ చేసుకునేందుకు డబ్బు లు ఇస్తుంటారు. కొన్నేళ్లుగా ఇది ఆనవాయితీగా వస్తోంది. పండుగ సమయంలోనే ఎన్నికలు రావడడంతో అడిగిన ప్రతీఒక్కరికి ఎంతోకొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొందని ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు.
ఊళ్లకు లిక్కర్.. యథేచ్ఛగా బెల్ట్‌షాప్‌ల రన్
దసరా పండుగ రోజు వైన్స్‌షాప్‌లు మూసిఉంటాయి. ఆరోజు మహాత్మా గాంధీ జయంతి కావడంతో మాంసం, మద్యం విక్రయాలు ఉండవు. దీంతో తొలుత లిక్కర్‌ను పల్లెల్లోని బెల్ట్‌షాపులకు తరలిస్తుండగా, మరికొందరు నేతలు వైన్స్ షాప్‌లకు అడ్వాన్స్ చెల్లించి క్వార్టర్స్‌ను తమకు నమ్మకస్తుడైన లీడర్లకు చెందిన నివాసాలు, వ్యవసాయ పొలాల్లోకి డంప్ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోనే కోడ్ అమల్లోకి వచ్చినా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పల్లెల్లో బెల్ట్‌షాపులు 24గంటలపాటు తెరిచే ఉంటున్నాయి. ఎన్నికల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయనే ఆశతో బెల్ట్‌షాపు వ్యాపారులు భారీగా మద్యం డంప్ చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
ఆశావహులు తమ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆయా రాజకీయ పార్టీల్లోని ఆశావహులు.. కులసంఘాల ఆధారంగా మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కులంలో ఉన్నఓట్ల ఆధారంగా యాటలను కోయించి, ఇంటింటికీ మటన్ పోగులు పంపించేలా ప్లాన్ చేస్తున్నారు. పండుగపూట మచ్చిక చేసుకోకపోతే ఎన్నికల్లో ఫలితం బెడిసి కొడుతుందని.. ఒకరినిచూసి మరొకరు మద్యం, మాసం పంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయో, వాయిదా పడుతాయో అనే సందిగ్ధంలో ఉన్నా.. అశావహులు ఖర్చుకు భయపడకుండా వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు వెనకాడడంలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 60 జెడ్పీటీసీ, 646 ఎంపీటీసీలు, 1,226 పంచాయతీల్లో ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.