
నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు
● కలెక్టర్ ఎం.హరిత
సిరిసిల్ల: జిల్లాలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఎం.హరిత కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)పై జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలకు కలెక్టరేట్‌లో మంగళవారం శిక్షణ నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన కూడదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బు తరలిస్తే పట్టుకొని, వీడియో తీసి పంచనామా చేయాలని, అనంతరం డబ్బుకు సంబంధించి రసీదు అందజేయాలని సూచించారు. ఎంసీసీ నోడల్ ఆఫీసర్‌గా డీఆర్డీవో శేషాద్రిని నియమించారు. వేములవాడ ఆర్డీవో రాధాబాయి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీపీవో షరీఫోద్దీన్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పాతూరి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.