
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
● బీజేపీ కుట్రలను తిప్పికొడదాం ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్లటౌన్: అంబేడ్కర్ అందించిన రాజ్యాంగాన్ని, దాని ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. స్థానిక కె–కన్వన్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాహుల్‌గాంధీ పాదయాత్రతో దేశంలోని వివక్షను రూపుమాపేందుకు కృషి చేస్తున్నారన్నారు. గత పదేళ్లలో బీజేపీ పేదలకు ఉపయోగపడే ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. బీజేపీ విధివిధానాలు ఎండగడుతూ ముందుకుపోవాలని కార్యకర్తలకు సూచించారు. కులగణనపై బీజేపీ, బీఆర్‌ఎస్ ఆరోపణలు తిప్పికొడుతూనే.. వాటికి చట్టబద్ధత కల్పించామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్‌బిన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ రుద్రా సంతోష్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆవేశ్‌ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి
వేములవాడఅర్బన్: ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండలం మారుపాక, గుర్రంవానిపల్లిల్లో రూ.2.25కోట్లతో సీసీరోడ్లు, డ్రెయినేజీలకు ఆదివారం భూమిపూజ చేశారు. విప్ మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలకు మిడ్‌మానేరులో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అంశాలను పరిశీలించాలని జిల్లా అధికారులకు సూచించారు. పార్టీ మండలాధ్యక్షుడు పిల్లి కనకయ్య ఉన్నారు.