సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చేనే త, పవర్‌లూం రంగాలపై నిర్లక్ష్యం చూపిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ విమర్శించారు. చేనేత, పవర్‌లూమ్ రంగాల కు బడ్జెట్‌లో రూ.371కోట్లు కేటాయించడంపై యూనియన్ ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల నేతన్నచౌక్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత, పవర్‌లూం రంగానికి బడ్జెట్‌లో కేవలం రూ.371 కోట్లు మాత్రమే కేటాయించి, నేతన్నలకు మొండిచేయి చూపారన్నారు. గత 15నెలలుగా చేనేత, పవర్‌లూం రంగాల్లో సంక్షోభం నెలకొని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 30మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి చేనేత– పవర్‌లూం రంగాలకు 2వేల కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలను ఐక్యంచేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాయకులు అన్నల్‌దాస్ గణే శ్, పవర్‌లూం వర్కర్స్ యూని యన్ పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్, వార్ఫి న్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కుమ్మరికుంట కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఒకే దేశం ఒకే ఎన్నికతో సుస్థిర పాలన
ముస్తాబాద్(సిరిసిల్ల): ఒకే దేశం ఒకే ఎన్నికతో దేశంలో సుస్థిర పరిపాలన జరిగి అభివృద్ధి జరగుతుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి అన్నారు. ముస్తాబాద్ బీజేపీ కార్యాలయంలో ఒకే దేశం ఒకే ఎన్నికపై గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మనదేశంలో వివిధ రాష్ట్రాలలో విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా పరిపాలన సులభమై, పథకాలు ప్రజలదరికీ చేరుతాయన్నారు. ప్రతిసారి ఎన్నికల కోడ్ రావడం, వివిధ దశలలో ఎన్నికలను నిర్వహించడం ద్వారా దేశానికి ఆర్థికంగా భారమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి సంతోష్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, క్రాంతి, నరేశ్, మహేందర్, వెంకన్న, మహేశ్వర్, పద్మ, బాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సురేశ్, భగత్, కార్తీక్, కృష్ణ పాల్గొన్నారు.
రాజన్న తలనీలాల సేకరణ టెండర్లు వాయిదా
వేములవాడ: వేములవాడ రాజన్నకు భక్తులు సమర్పించుకునే తలనీలాలు సేకరణకు మూడోసారి నిర్వహించిన టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా వేసినట్లు ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి గురువారం తెలిపారు. తిరిగి నిర్వహించే తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. గత రెండేళ్ల క్రితం నిర్వహించిన టెండర్ ఏప్రిల్ 11తో ముగియనుంది. గతసారి రూ.19.01కోట్లతో రెండేళ్లకు టెండర్ దక్కించుకున్నారు. తీరా రూ.10 కోట్ల మేర కాంట్రాక్టర్ బాకీపడగా, ఇటీవల రూ.2.50 కోట్లు చెల్లించి ఆలయ అధికారులు పోగుచేసిన తలనీలాలను తీసుకెళ్లారు. మిగతా డబ్బులు ఎప్పుడి చెల్లిస్తాడో..? ఏమో అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో తలనీలాలకు డిమాండ్ తగ్గడంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని నాయీబ్రాహ్మణులు అంటున్నారు. మొత్తానికి రాజన్నకు ఈసారి తలనీలాల సేకరణలో గండి పడనుందని చెప్పుకుంటున్నారు. అధికారులు ఏవిధమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానం
సిరిసిల్ల: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో ఎస్సీ విద్యార్థినీ, విద్యార్థుల నుండి విదేశీ విద్య స్కాలర్ షిప్‌ల కోసం దరఖాస్తులను కోరుతున్నామని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రాజా మనోహర్‌రావు గురువారం తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులకు రూ.20లక్షల వరకు స్కాలర్ షిప్‌లు అందిస్తారని ఆయన వివరించారు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేయాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు ఆఫీస పని వేళల్లో 79893 84801 ఫోన్ నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.
నేతన్నల విషయంలో సర్కారు నిర్లక్ష్యం