● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: తెలంగాణపై బీఆర్‌ఎస్ నాయకులకు చిత్తశుద్ధి లేదని, అధికారం చేతికిస్తే అప్పులకుప్పగా మార్చారని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అన్నా రు. గురువారం వేములవాడలో మాట్లాడారు. తె లంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన అందెశ్రీ పాట (జయ జయ హే తెలంగాణ)ను పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌కు రాష్ట్ర గీతం చేయాలని సోయిలేకుండా పోయిందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అందెశ్రీ పాటను రాష్ట్ర గీతంగా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పించి జూన్ 2న ప్రకటించడానికి నిర్ణయించారని, దీనిపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. అణగారినవర్గానికి చెందిన అందెశ్రీ గీతానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టాభిషేకం చేస్తుంటే సహించలేక కొత్త రగడ చేస్తున్నారని అన్నారు. యాదాద్రి ఆర్కిటెక్ట్‌గా ఆంధ్రకు చెందిన సాయిని నియమించినప్పుడు ఎక్కడ పోయింది ‘మీ తెలంగాణ పౌరుషం’ అని ప్రశ్నించారు. ఆంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కేసీఆర్ అన్నది యాదికి లేదా అన్నారు. అలాగే తెలంగాణ అధికారిక చిహ్నం ప్రజలు, ఉద్యమకారులు, మేధావుల ఆకాంక్షల మేరకు రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ‘తెలంగాణ ప్రజలపై ఇంత ప్రేమ ఒలకబోస్తున్న మీరు అసలు మీ పార్టీ నుంచి తెలంగాణ పదం ఎందుకు తీసివేసి భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారో ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని అన్నారు.