● రైలు నుంచి జారిపడి మృతి
నెల్లూరు(క్రైమ్): స్నేహితుడి తల్లి మరణించడంతో చివరిచూపు కోసం వెళ్తున్న యువకుడు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. ఒంగోలు తంగెళ్ల ఖాసీం వీధికి చెందిన ఎస్.వెంకట చైతన్య(23) తన స్నేహితులతో కలిసి బెంగళూరులో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. ఒంగోలులో స్నేహితుడి తల్లి మరణించడంతో చివరిచూపు కోసం బుధవారం ఒంగోలు వచ్చేందుకు బలూర్‌ఘాట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. ఇది నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ మీదకు చేరుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆయన రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
● అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించకుండానే రోడ్ల విస్తరణ
కందుకూరు: పట్టణంలో చేపడుతున్న రోడ్ల విస్తరణలో భాగంగా పలు చోట్ల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు, రోడ్లను విశాలంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ఈ పనుల్లో పలుచోట్ల పాత అడ్డంకులను తొలగించకుండానే రోడ్లు వేస్తున్నారు. దీని వల్ల మరింత ప్రమాదకరంగా మారతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా కనిగిరి రోడ్డు నుంచి బలిజపాలేనికి వెళ్లే రోడ్డును అధికారులు విస్తరిస్తున్నారు. ఇది నాలుగు రోడ్ల కూడలి. అటు కనిగిరి రోడ్డు, కోవూరు రోడ్డు, బలిజపాలెంకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం బలిజపాలెంలోకి వెళ్లే రోడ్డును ఇరువైపులా విస్తరిస్తున్నారు. అయితే రోడ్డుకు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని అలాగే ఉంచి చుట్టూ రోడ్డు వేస్తున్నారు. అలాగే రోడ్డుకు మరోవైపు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను అక్కడి నుంచి మార్చలేదు. దీని వల్ల ఆ ప్రాంతంలో విస్తరణ పనులు పూర్తయిన తరువాత వేగంగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఆందోళన స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రదర్శిస్తున్న ఈ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


