● అద్దంకిలో దారుణం
● డబ్బు కోసమేనని అనుమానం
అద్దంకి: పట్టణంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. స్థానిక కట్టకిందపాలేనికి చెందిన వృద్ధురాలు మున్నంగి లక్ష్మిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడిచేశారు. భర్త, పిల్లలు లేని ఆమె.. ఓ బిర్యానీ సెంటర్ వద్ద భిక్షాటన చేస్తూ రాత్రి పూట అక్కడే నిద్రిస్తుంటుంది. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును కాజేసేందుకు దుండగులు ఆమె మెడపై కత్తితో కోసి పరారైనట్లు తెలుస్తోంది. రక్తపు మడుగులో పడిఉన్న బాధితురాలిని గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను ఒంగోలు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
రిక్షాల బజారులో పట్టపగలే చోరీ
● షాపుకు వెళ్లి వచ్చే సరికి బీరువాలోని నగలు మాయం
ఒంగోలు టౌన్: నగరం నడిబొడ్డున పట్టపగలే దొంగలు పడ్డారు. ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు దర్జాగా బీరువా షెల్ఫ్ పగులగొట్టి నగలు, నగదుతో ఉడాయించారు. పోలీసుల కథనం ప్రకారం... కొత్త కూరగాయల మార్కెట్లో కిరాణా దుకాణం నిర్వహించే కారుమూరి వెంకట అశోక్‌కుమార్ కుటుంబంతో కలిసి నగరంలోని రిక్షాల బజారులో నివాసం ఉంటున్నారు. ఉదయం 6 గంటలకు అశోక్‌కుమార్ దుకాణానికి వెళ్లారు. 10.30 గంటలకు ఆయన భార్య మౌలిక దుకాణానికి వెళ్లగానే..అశోక్ ఇంటికి వచ్చి మధ్యాహ్నం వరకు విశ్రాంతి తీసుకున్నారు. ఎప్పటిలాగే మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భార్యకు భోజనం తీసుకొని తల్లి విజయలక్ష్మితో కలిసి దుకాణానికి వెళ్లారు. 2 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా బీరువా వద్ద దుస్తులు గందరగోళంగా పడి ఉన్నాయి. బీరువా లోపలి షెల్ఫ్ తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి పరిశీలిస్తే అందులోని మూడు సవర్ల బంగారు కడియం, 3 ఉంగరాలు, చెవిబుట్టలు మొత్తం కలిపి 49 గ్రాముల బంగారు నగలు, రూ.12,500 నగదు కనిపించలేదు. వెంటనే టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే దొంగలు పడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


