ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డెక్కిన పొగాకు రైతులు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డెక్కిన పొగాకు రైతులు

Jul 30 2026 12:45 AM | Updated on Jul 30 2026 12:45 AM

పొగాకుకు మద్దతు ధర కల్పించాలంటూ హైవే దిగ్బంధించిన రైతులు ఒంగోలు, టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై బైఠాయింపు పొగాకు రైతులను బిక్షగాళ్లలా చూస్తున్నారని మండిపాటు ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్‌ ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం ఆగదంటూ నినాదాలు గంటకుపైగా హైవేపై వాహనాల రాకపోకలు అడ్డుకున్న రైతులు పొగాకు రైతుల అరెస్టు

ఒంగోలు సబర్బన్‌:

గుండె మండిన పొగాకు రైతులు జిల్లాలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై 95 రోజులు కావస్తున్నా గిట్టుబాటు ధర ఇవ్వకుండా నో బిడ్ల పేరుతో వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన పొగాకును తిరిగి వెనక్కు పంపించటాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలోని త్రోవగుంట వద్ద, టంగుటూరు టోల్‌ ప్లాజా వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ నినాదాలు చేశారు. సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో తెలిపిన నిరసనతో దాదాపు గంటకు పైగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందుగా పోలీసులు పొగాకు రైతుల ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ఒంగోలు నగరానికి దక్షిణాన ఒకచోట, ఉత్తర బైపాస్‌ వద్ద రెండు చోట్ల పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేసి మరీ వాహనాల రాకపోకలను ఆపేశారు. ఆందోళన అనంతరం పోలీసులు పొగాకు రైతులను, రైతు నాయకులను బలవంతంగా పోలీస్‌ వాహనాల్లో ఎక్కించి ఒంగోలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకాశం జిల్లా కన్వీనర్‌ చుండూరు రంగారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పొగాకు పంటకు సీ గ్రేడుకు కిలో రూ.110 అని ప్రకటించటాన్ని తీవ్రంగా ఖండించారు. రైతులను నిలువునా నష్టాలపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ నీట్‌ పేపరు లీకేజీలో యువత ఢిల్లీలో ఆందోళన చేసిన మాదిరిగా ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వాలు దిగిరావన్నారు. రాష్ట్ర మంత్రులు, అధికారులు కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఢిల్లీ వెళితే పొగాకు రైతులకు మేలు జరుగుతుందని సంతోష పడ్డామని, కానీ చర్చల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పొగాకు ధరలు తగ్గించి ప్రకటించటం దారుణమని మండిపడ్డాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సీ గ్రేడ్‌ పొగాకు రూ.110 అని ప్రకటించటం అత్యంత దారుణమైన మాటన్నారు. ఏ గ్రేడ్‌కు రూ.240, బీ గ్రేడ్‌కు రూ.190 అని ప్రకటించటమంటే పొగాకు రైతును నిలువునా మోసం చేయటమేనని అన్నారు. సరాసరి కిలో పొగాకు ధర రూ.250 దక్కితేనే రైతు అప్పుల పాలు కాకుండా ఉంటాడన్నారు. అంటే మేలు రకం పొగాకు కిలో రూ.300లకు పైగా ధర పలికితేనే రైతుకు గిట్టుబాటవుతుందని చెప్పారు. ప్రభుత్వమే దిగివచ్చి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి రూ.1000 కోట్లు కేటాయించి పొగాకును కొనుగోలు చేయించాలని డిమాండ్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రైతు, కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.లలిత కుమారి మాట్లాడుతూ పొగాకు రైతుకు అందరూ అండగా నిలవాలన్నారు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్న ప్రభుత్వాలు పొగాకు రైతుల కోసం కేవలం రూ.1000 కోట్లు కేటాయించి పొగాకును కొనుగోలు చేయలేరా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా కళ్లు తెరిచి ప్రభుత్వం పొగాకు రైతును ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘాల నేతలు జజ్జూరి జయంత్‌ బాబు, కిలారు పెద్దబ్బాయి, టి.శ్రీకాంత్‌, వడ్డే హనుమారెడ్డి, పెంట్యాల హనుమంతరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, కాలం సుబ్బారావు, చీకటి శ్రీనివాస రావు, బంకా సుబ్బారావు, తోట తిరుపతయ్య, ఎంఎస్‌ సాయి, కోడూరి నాంచార్లు, పద్మతో పాటు వందలాది మంది పొగాకు రైతులు పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై మొహరించిన పోలీసులు

ఒంగోలు టౌన్‌: పొగాకు రైతులు, సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాతీయ రహదారు దిగ్బంధనానికి పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. జాతీయ రహదారి వెంట కీలక జంక్షన్లు, పొగాకు ఎక్కువగా సాగు చేసే గ్రామాలకు సంబంధించిన రహదారులు, టంగుటూరు, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే పోలీసులను నియమించారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహంగా ఉన్న రైతులు ఎక్కడ హద్దులు దాటుతారోనని పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఏఎస్పీ (అడ్మిన్‌) యుగంధర్‌ బాబు పర్యవేక్షణలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయ కృష్ణ, రూరల్‌ సీఐ శేషగిరిరావు, చీమకుర్తి, మద్దిపాడు, రూరల్‌, తాలుకాలకు చెందిన ఎస్సైలు, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసు సిబ్బందిని భారీగా మోహరించారు. డ్రోన్‌ కెమెరాలతో నిరసన కార్యక్రమాన్ని సమీక్షించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చాలా చోట్ల రూట్‌ డైవర్షన్‌ చేసి వాహనాలను పంపించారు. అయితే రైతులు ఎక్కడా తమ పరిధిని దాటి వ్యవహరించలేదు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.

మంత్రి స్వామికి పొగాకు రైతుల సమస్యలు పట్టవా...

టోల్‌ ప్లాజాకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంత్రి డోలా స్వామికి పొగాకు రైతుల కష్టాలు కనపడటం లేదా అని రైతు సంఘాల నాయకులు ప్రశ్నించారు. ట్రాక్టర్‌ ర్యాలీ, అన్ని వేలం కేంద్రాల్లో నిరసనలు తెలిపినా, వేలం కేంద్రాలు రోజులు తరబడి నిలుపుదల చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతుల జాతీయ రహదారి దిగ్బధనం నేపథ్యంలో దర్శి డీఎస్పీ బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 130 సిబ్బందిని మొహరించారు. దాదాపు అర్ధగంట పాటు టోల్‌ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలుపుతున్న సమయంలో అరెస్టు చేసి టంగుటూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు, రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు పరిటాల కోటేశ్వరరావు, సీఎస్‌ సాగర్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, రైతు సంఘం, కార్మిక సంఘం నాయకులు సింగయ్య, కొండారెడ్డి, ఆర్‌ మోహన్‌, లక్ష్మీ, ప్రభాకర్‌, వెంకట్రావు, రఘురాం, పమిడి నాగేశ్వరరావు, రమాదేవి, ఏసుపోగు బాలకోటయ్య తదితరులను మొత్తం 34 మంది రైతులను అరెస్ట్‌ చేశారు.

టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద..

టంగుటూరు: పొగాకు రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రూ.1000 కోట్లు కేటాయించి ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది పొగాకు రైతులు బుధవారం టంగుటూరు టోల్‌ ప్లాజా వద్ద జాతీయ రహదారిని నిర్బంధించారు. టంగుటూరు, కొండపి, కందుకూరు వేలం కేంద్రాల పరిధిలోని గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ మార్కెట్‌లో పొగాకు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలు దిగజార్చారన్నారు. గత ఏడాది కేజీ సరాసరి రూ.250 ఉంటే, ఈ ఏడాది సరాసరి రూ.190కు పడిపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు వ్యాపారుల ప్రయోజనాలకే పనిచేస్తున్నాయని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement