పాలేరులో జోరుగా టీడీపీ నాయకుల ఇసుక దందా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు పలుమార్లు అధికారులకు హైకోర్టు అక్షింతలు ఇసుక దందా చేస్తున్న టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు హైకోర్టు ఆదేశాలు సైతం అధికారులు బేఖాతరు...మంత్రికి జీ హుజూర్ ఏడుగురు టీడీపీ నాయకులపై గ్రామబహిష్కరణ, పీడీ యాక్టుకు మైనింగ్ శాఖ సిఫార్సు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్న పొన్నలూరు మండల రెవెన్యూ, పోలీసు అధికారులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అరికట్టాల్సిన అధికారులూ వారికి వంతపాడుతున్నారు. పాలేరులో దోపిడీయే లక్ష్యంగా ఇసుక దందా సాగిస్తూ సహజ వనరులను కొల్లగొడుతున్న టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు, మైనింగ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినా పొన్నలూరు మండల రెవెన్యూ, పోలీసు, ఎంపీడీవో కార్యాలయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మంత్రి స్వామి ఆదేశాలకు జీహుజూర్ అంటూ పట్టీపట్టనట్లు ఉంటూ ఇసుక దోపిడీకి అండగా నిలుస్తున్నారు. ఈ అక్రమ దందాకు పొన్నలూరు మండలం వేంపాడు, ఉప్పలదిన్నె రీచ్‌లు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి అక్రమ ఇసుక తవ్వకాలు చేయొద్దని ఆయా ప్రాంతాల గ్రామస్తులు ఎన్నిసార్లు వేడుకున్నా, పత్రికలు పలుమార్లు కథనాలు రాసినా అక్రమార్కులు పట్టించుకోకుండా ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా జేసీబీలతో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. వేంపాడు గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకుడు దాసరి వెంకటేశ్వర్లు పలుమార్లు ఇసుక తవ్వకాలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా తవ్వకాలు ఆపకపోవడంతో చివరకు హైకోర్టులో రెండుసార్లు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయటంతో స్పందించిన కోర్టు ఈ ఏడాది మార్చి, జూన్ నెలలో ఈ దోపిడీని అరికట్టాలని.. మీరు తీసుకున్న చర్యలను తెలియజేయాలని అధికారులను ఆదేశించింది.
టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోండి:
పాలేరులో ఇసుక దందాకు పాల్పడుతున్న పొన్నలూరు మండల టీడీపీ నాయకులు నాగిరెడ్డి పాలెంకు చెందిన పార్టీ మండల అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు కుమారుడు అనుమోలు సుధా, వేంపాడుకు చెందిన దాసరి కృష్ణారావు, పూరిమిట్ల మాల్యాద్రి, బైరుడ్ల ఇజ్రాయిల్, మాజీ ఎంపీపీ కొండగుంట శ్రీనివాసరావు, కొండగుంట సురేష్, జరుగుమల్లి టీడీపీ మండల అధ్యక్షుడు పోకూరి రవి లను మైనింగ్ శాఖ అధికారులు పలుమార్లు హెచ్చరించటంతో పాటు వీరిపై 132 కేసులు నమోదు చేసి రూ.25 లక్షలు జరిమానా కింద వసూలు చేశారు. అయినా వీరిలో మార్పు రాలేదు. అక్రమ ఇసుక రవాణాను వీరు వృత్తి గా మార్చుకున్నారని, వారిని గ్రామ బహిష్కరణ చేయాలని, పీడీ యాక్టు నమోదు చేయాలని, వాల్టా యాక్టు విధించాలని కోరుతూ జిల్లా మైనింగ్ శాఖ అధికారి టీ రాజశేఖర్ మార్చి 24వ తేదీ, జూన్ 3వ తేదీ మండల తహశీల్దార్, ఎస్సై, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక హైకోర్టు కూడా పలుమార్లు ఇసుక దందా పై సదరు అధికారులకు అక్షింతలు వేసింది. కానీ వీరికి మాత్రం హైకోర్టు ఆదేశాల కన్నా మంత్రి స్వామి ఆదేశాలే శిరోధార్యమయ్యాయి. దీనిని బట్టి నియోజకవర్గంలో వ్యవస్థలు ఏవిధంగా నాశనం అయ్యాయో అర్థమవుతుంది.
ఇసుక దందాపై హైకోర్టు హెచ్చరికలు:
ఇసుక దందాపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఎన్నిసార్లు అధికారులను హెచ్చరించినా పట్టించుకోకపోవటంతో ఆగ్రహించిన హైకోర్టు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుకు, పొన్నలూరు ఎంపీడీఓ, తహశీల్దార్, ఎస్సైలకు తదుపరి విచారణకు వచ్చేటప్పుడు మీరు తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిని బట్టి నియోజకవర్గంలో ఇసుక దోపిడీ ఏవిధంగా సాగుతోందో, వ్యవస్థలను మంత్రి స్వామి ఎలా చిన్నాభిన్నం చేశారో అర్థమవుతుంది. నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి వ్యవస్థలను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
మంత్రి స్వామిని బర్తరఫ్ చేయాలి
నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. హైకోర్టు ఆదేశాల కన్నా మంత్రి స్వామి ఆదేశాలు మాత్రమే అధికారులు పాటిస్తూ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇసుక దోపిడీలో పొన్నలూరు మండల ముఖ్య టీడీపీ నాయకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు పాటిస్తూ వీరిని గ్రామ బహిష్కరణ చేసి, వీరిపై పీడీ యాక్టు, వాల్టా చట్టం నమోదు చేయాలి. మంత్రి స్వామి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. లేదా సీఎం చంద్రబాబు మంత్రి స్వామిని బర్తరఫ్ చేయాలి.
– డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి


