‘మామూలు’ ఇస్తేనే మస్టర్‌! | - | Sakshi
Sakshi News home page

‘మామూలు’ ఇస్తేనే మస్టర్‌!

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

‘మామూలు’ ఇస్తేనే మస్టర్‌!

పొదిలి రూరల్‌: ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు అరకొర వేతనాలు.. వీటికి తోడు ఉపాధి హామీ సిబ్బంది లంచాల వేధింపులతో కూలీలు విలవిల్లాడుతున్నారు. ‘అధికారం మాది.. అడిగినంత ఇస్తేనే పని.. లేదంటే దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ పొదిలి మండలంలో కొందరు సిబ్బంది బరితెగిస్తున్నారు. మండలంలోని తుమ్మగుంట పంచాయతీలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ (ఎఫ్‌ఏ) వై.మల్లికార్జునరావు తీరుపై ఉపాధి కూలీలు మండిపడుతున్నారు. మంగళవారం ఎంపీడీఓ శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. పని కావాలంటే వారానికి రూ.400 లంచం ఇవ్వాలని ఎఫ్‌ఏ డిమాండ్‌ చేస్తున్నాడని వాపోయారు. వంద మంది పనికి వెళ్తే.. డబ్బులిచ్చిన 70 మందికే డిమాండ్‌ పెట్టి, మిగతా వారికి పని ఇవ్వకుండా వివక్ష చూపుతున్నాడని బీరం రంగమ్మ, బీరం వెంకటరత్తమ్మ, చినగోపాల్‌రెడ్డి, లక్ష్మి, కృష్ణవేణి, తిరుపతమ్మ, నాగార్జునరెడ్డి, చెంచయ్య తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అడిగినంత ఇవ్వలేదన్న కక్షతో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు చేసిన పనికి సంబంధించిన మస్టర్లను తమ వద్దే ఉంచి అప్‌లోడ్‌ చేయలేదని ఎంపీడీఓకు చూపించారు. మే నెలలో రెండు వారాల పాటు చేసిన పనికి కూడా మస్టర్‌ వేయలేదని, దీనిపై ఏపీఓకు మొరపెట్టుకున్నా ‘ఆ డబ్బులు మర్చిపోండి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వారు ఆరోపించారు. కూలీల ఫిర్యాదుపై ఎంపీడీఓ శ్రీనివాసరావు స్పందిస్తూ.. కూలీలతో దురుసుగా వ్యవహరిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న సదరు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను విధుల నుంచి తొలగించేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తానని చెప్పారు.

పని కావాలంటే వారానికి రూ.400 ఇవ్వాలని ఎఫ్‌ఏ డిమాండ్‌

ఎంపీడీఓకు మొరపెట్టుకున్న తుమ్మగుంట ఉపాధి కూలీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement