తేరాతేజి పండుగనాడు కోలాహలంగా ఉన్న కంభం చెరువు (ఫైల్)
కంభం చెరువు
కంభం:
ఏటా చారిత్రాత్మక కంభం చెరువుకట్టపై జరుపుకునే తేరాతేజి వేడుకలకు కంభం చెరువు ముస్తాబైంది. పండుగ రోజు చెరువుకట్టకు ముస్లింలు సకుటుంబ సమేతంగా వచ్చి అక్కడే భోజనాలు చేసి సాయంత్రం వరకు సరదాగా గడిపి వెళ్తారు. ఇతర కులాలకు చెందిన వారు సైతం పిల్లలతో కలిసి సరదాగా చెరువుకట్టపైకి వచ్చి వెళ్తారు. కర్నూలు, గుంటూరు, నంద్యాల, గిద్దలూరు, దొనకొండ, వినుకొండ, తదితర ప్రాంతాల నుంచి పండుగ రోజున కంభం చెరువుకు అధిక సంఖ్యలో వస్తారు. రైళ్లలో వచ్చే వారు కంభం చెరువు సమీపంలో పండుగరోజున రైళ్లను సైతం ఆపేసి అక్కడే దిగుతుంటారు. కంభం చెరువులో నీళ్లు ఉండటంతో ఈ సారి ప్రజలు అధికంగా వచ్చే అవకాశం ఉంది.
సందర్శకుల తాకిడి..
ప్రస్తుతం కంభం చెరువులో ప్రస్తుతం 13 అడుగుల మేర నీళ్లు ఉండటంతో చెరువుకు ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు కంభం బస్టాండ్‌లో దిగి ఆటోల్లో చెరువుపైకి చేరుకుంటారు. కొందరు కార్లలో నేరుగా చెరువుకట్టపైకి వస్తారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ట్రాక్టర్లలో, పెద్ద ఆటోలలో సకుటుంబ సమేతంగా చెరువుకట్టపైకి వస్తారు. అధిక సంఖ్యలో వాహనాలు వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
నెలపొడుపు కనిపించిన 13వ రోజు తేరాతేజి పండుగను ముస్లింలు జరుపుకుంటారు. తేరాతేజి నెలను చేదు నెలగా చెబుతుంటారు. కొత్తగా పెళ్లయిన వధూవరులు నెల పొడుపు కనిపించినప్పటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా 13వ రోజు తేరాతేజి పండుగ సందర్భంగా కంభం చెరువు కట్టపై కలుసుకుంటారు. అక్కడే వారి పెళ్లి నాటి దండలను నీళ్లలో వదిలి మొక్కులు తీర్చుకుంటారు. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలసి సహపంక్తి భోజనాలు చేస్తారు. పండుగ సందర్భంగా చెరువు కట్ట పైన ఉన్న దీనాషావళి దర్గా వద్ద ప్రత్యేక పూజలు జరుగుతాయి. అందుకోసం కట్టపైన ఉన్న దర్గాను నిర్వాహకులు ముస్తాబు చేస్తారు. అదే విధంగా చెరువుకట్టపై ఉన్న పచ్చికను తొక్కితే ఆరోగ్యానికి మంచిదని నమ్ముతుంటారు అందుకనే ఈ పండుగను గరికతొక్కుడు పండుగగా పిలుస్తారు.
చుట్టూ అందమైన కొండలు, కనువిందు
చేసే ప్రకృతి అందాలు, అలలపై పడే
సూర్యకిరణాలతో చారిత్రాత్మక కంభం చెరువు ఎప్పుడూ పర్యాటకలను
ఆకట్టుకుంటుంది. అలాంటి కంభం
చెరువుకట్టపై జరిగే పండుగకు ఎంత
ప్రత్యేకత ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఉభయ తెలుగురాష్ట్రాల్లో కంభంలో మాత్రమే
జరుపుకునే పండుగ తేరాతేజి. దీనిని గరిక తొక్కుడు పండుగా కూడా
పిలుస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి
కుటుంబ సమేతంగా సెలవులు
పెట్టుకొని మరీ పండుగ రోజున
కంభంలో ఉన్న వారి బంధువుల ఇళ్లకుచేరుకుంటారు.


