● అద్దం పగులగొట్టి మహిళ మెడలోని
బంగారం అపహరణ
నక్కపల్లి: అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై వేంపాడు టోల్‌ప్లాజా సమీపంలో కారులో కూర్చున్న ఒక మహిళ మెడలోంచి గుర్తుతెలియని వ్యక్తి 3 తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యాడు. సీఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం... మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన పి.రమేష్ బాబు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు కారులో వెళ్తున్నారు. డ్రైవర్‌కు నిద్రరావడంతో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో టోల్‌ప్లాజా దాటిన తర్వాత జాస్ హోటల్ సమీపంలో కారును రోడ్డుపక్కన నిలిపి విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఒక దుండగుడు కారు సైడు అద్దాన్ని రాయితో పగులగొట్టి, రమేష్ భార్య కల్యాణి మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సీఐ తెలిపారు.


