నేడు విద్యాసంస్థల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యాసంస్థల బంద్‌

Jul 24 2026 2:21 AM | Updated on Jul 24 2026 2:21 AM

జయప్రదం చేయాలని కోరుతూ విద్యార్థుల ర్యాలీ

ఒంగోలు టౌన్‌: నీట్‌ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై కేంద్ర పోలీసు బలగాలు లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్‌ నిర్వహించనున్నారు. బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ గురువారం ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండు సెంటర్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నీట్‌ పరీక్షలను రద్దు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బండి వీరాస్వామి మాట్లాడుతూ నీట్‌ పరీక్ష పేపర్లు లీక్‌ కావడంతో దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని మరణించారని, ఆ మరణాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఫెడరల్‌ వ్యవస్థను దెబ్బతీస్తున్న నీట్‌ విధానాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా పరీక్షలు నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి సీహెచ్‌ వినోద్‌ మాట్లాడుతూ... పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు కర్కశంగా దాడి చేసి లాఠీలతో కొట్టడం దుర్మార్గమన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి చేయడమనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.బాబు మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న పరీక్షల లీకేజీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పారు. విద్యార్థులు చేస్తున్న న్యాయపోరాటానికి వ్యవసాయ కార్మిక సంఘం బేషరతుగా మద్దతు పలుకుతోందన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ... కన్నబిడ్డల్లాంటి విద్యార్థులపై పోలీసులు అత్యంత క్రూరంగా దాడి చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు దేశ పాలకులు క్షమాపణ చెప్పాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి యువజన నాయకులు, నీట్‌ విద్యార్థులు మోహన్‌, నవీన్‌, ఆదిలక్ష్మి, మాలతి, ప్రశాంత్‌, నితీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement