వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ అండ్ యర్రం చినపోలిరెడ్డి
స్టడీ బ్లాక్ భవన సముదాయం
మేదరమెట్ల:
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల సాధన పేద విద్యార్థులకు సవాల్‌గా మారింది. కోచింగ్ సెంటర్లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేయలేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులకు మేదరమెట్లలో ఏర్పాటైన శ్రీవైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ అండ్ యర్రం చినపోలిరెడ్డి స్టడీ బ్లాక్‌శ్రీ ఒక దిక్సూచిలా మారింది. లక్షల రూపాయల విలువైన ఆధునిక కంప్యూటర్లు, పోటీ పరీక్షలకు అవసరమైన అమూల్యమైన పుస్తకాలను ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీ.. ఉద్యోగార్థులకు, పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.
సొంతూరి రుణం తీర్చుకునే దిశగా..
జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పుట్టిన ఊరు మరువలేనివి.. వాటి రుణం తీర్చుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇదే స్ఫూర్తితో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, అద్దంకి ఏఎంసీ మాజీ చైర్మన్ వైవీ భద్రారెడ్డి తమ స్వగ్రామం మేదరమెట్ల అభివృద్ధికి తమ వంతు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చారు. గ్రామీణ విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను జోడించి విద్యావకాశాలు మెరుగుపరచాలన్న ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నదే ఈ ఆధునిక డిజిటల్ లైబ్రరీ.
రూ.60 లక్షలతో అత్యాధునిక వసతులు
సుమారు రూ.60 లక్షల వ్యయంతో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ అండ్ యర్రం చినపోలిరెడ్డి స్టడీ బ్లాక్‌లను సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నుంచి రూ.20 లక్షలు మంజూరు కాగా, నిధుల కొరత రాకుండా మిగిలిన రూ.40 లక్షలను వైవీ భద్రారెడ్డి తన ప్రత్యేక చొరవతో సమీకరించారని మాజీ సర్పంచ్ ఎలీశమ్మ పేర్కొన్నారు. సకల హంగులతో రూపుదిద్దుకున్న ఈ డిజిటల్ లైబ్రరీ, స్టడీ బ్లాక్‌లను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, అప్పటి వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి పాణెం చిన్న హనిమిరెడ్డి ప్రారంభించారు.
నిర్వహణపై శ్రద్ధ అవసరం..
విశాలమైన భవనం, అత్యాధునిక కంప్యూటర్లు, ప్రశాంతమైన స్టడీ హాల్.. ఇలా మౌలిక సదుపాయాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇంతటి బృహత్తర ప్రాజెక్టు విద్యార్థులకు నిరంతరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండాలంటే, దీని నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే, లైబ్రరీలో ఉన్న వనరులు, సదుపాయాలపై చుట్టుపక్కల ప్రాంతాల యువతకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.


