దైవ దర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు..

Jul 23 2026 12:36 AM | Updated on Jul 23 2026 12:36 AM

గిద్దలూరు రూరల్‌: దైవ దర్శనం చేసుకుని ఆనందంగా ప్రయాణిస్తున్న ఆ కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. మహానంది నుంచి శ్రీశైలం వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. బస్సును ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో బాబాయ్‌, మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయ విదారక ఘటన బుధవారం గిద్దలూరు పట్టణ శివారులో చోటుచేసుకుంది.

మహానంది నుంచి శ్రీశైలం వెళ్తుండగా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్‌ గ్రామానికి చెందిన సిద్దగోని మహేశ్‌, మానస దంపతులు, తమ ఇద్దరు కుమారులు, మహేశ్‌ తమ్ముడు శేఖర్‌తో కలిసి ఐదుగురు ఆల్టో కారులో దైవదర్శనాలకు బయలుదేరారు. ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీరు, అనంతరం మహానందికి చేరుకున్నారు. మహానందిలో దర్శనం అనంతరం బుధవారం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి బయలుదేరారు. కారును శేఖర్‌(35) నడుపుతున్నాడు. గిద్దలూరు పట్టణంలోని ఒంగోలు రోడ్డులో ఉన్న చాణక్య స్కూల్‌ సమీపంలోకి రాగానే.. ముందు వెళ్తున్న బస్సును కారు ఓవర్‌టేక్‌ చేయబోయింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో కారు నడుపుతున్న శేఖర్‌తో పాటు మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మహేశ్‌, మానస దంపతులతో పాటు వారి మరో కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన బొలెరో వాహనం శిరివెళ్ల గ్రామానికి చెందినది కాగా, డ్రైవర్‌ కేశవకు స్వల్ప గాయాలయ్యాయి.

సెల్‌ఫోన్‌ నంబర్ల ఆధారంగా గుర్తింపు..

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితుల సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా వారు నల్గొండ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారి బంధువులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై గిద్దలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బొలెరోను ఢీకొన్న కారు.. ఇద్దరు దుర్మరణం

మృతుల్లో మూడేళ్ల బాలుడు, బాబాయి

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

నల్గొండ జిల్లా మాల్‌కు చెందిన కుటుంబంలో తీరని శోకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement