గిట్టు బాట పట్టక.. వేలాలు కుదురుకోక ! | - | Sakshi
Sakshi News home page

గిట్టు బాట పట్టక.. వేలాలు కుదురుకోక !

Jul 23 2026 12:36 AM | Updated on Jul 23 2026 12:36 AM

పొగాకు రైతుకు కొండంత బలం

వేలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా కుదుటపడని పొగాకు మార్కెట్‌

వేలం కేంద్రాల్లో కంపెనీల మాయాజాలం

గిట్టుబాటు ధరలు రాక నిరంతరం పోరాట బాట పడుతున్న రైతులు

మార్కెట్‌ సంక్షోభంతో ముందుకు కదలని పొగాకు వేలం ప్రక్రియ

రైతు పోరాటాలకు అండగా నిలుస్తున్న వైఎస్సార్‌ సీపీ

రైతులకు అండగా ఉంటానన్న జగన్‌ ప్రకటనతో రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

జిల్లా పరిధిలోని పొగాకు రైతులు, వైఎస్సార్‌ సీపీ నాయకులతో బుధవారం తాడేపల్లిలో సమావేశం నిర్వహించిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొగాకు రైతుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని ప్రకటించారు. ఇది కష్టాల్లో కూరుకుపోయిన పొగాకు రైతుల పోరాటాలకు కొండంత బలం చేకూరినట్లు అయింది. ఈ పర్యటనలో భాగంగా అవసరమైతే కందుకూరులో పర్యటించి వేలం కేంద్రాలను పరిశీలిస్తానని చెప్పడంతో జిల్లాలో పొగాకు రైతులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పొగాకు రైతుల పోరాటం భవిష్యత్‌లో మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కందుకూరు:

ఏడాది పొగాకు వేలం కాస్త ఆలస్యంగా మొదటి దశలో గత మార్చి 25వ తేదీన కందుకూరు, పొదిలి వేలం కేంద్రాల్లో ప్రారంభమైంది. పది రోజుల తరువాత ఒంగోలు రీజియన్‌ పరిధిలోని అన్ని వేలం కేంద్రాల్లోను వేలాన్ని ప్రారంభించారు. వేలం ప్రారంభమై మూడు నెలల పూర్తిగా గడిచిపోయాయి. రీజియన్‌ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లోను రైతులకు సరైన మద్దతు ధరలు లభించడంలేదు. దీంతో ధరల కోసం రైతులు నిత్యం పోరాట పంథాని ఎంచుకుంటున్నారు. ప్రతి రోజు ఏదో ఒక వేలం కేంద్రంలో వేలాన్ని అడ్డుకుంటూ నినదిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కందుకూరు, కొండపి, పొదిలి, వెల్లంపల్లి, కనిగిరి, ఒంగోలు, డీసీపల్లి వంటి అన్ని ప్రాంతాల్లోను రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో వేలం ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న తరహాలో సాగుతోంది. రోజులు గడిచే కొద్దీ మెరుగుపడాల్సిన మార్కెట్‌ దిగజారుతుండడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనబాట పడుతున్నారు. వేలాన్ని అడ్డుకోవడంతో పాటు, రోడ్లపై ధర్నాలకు దిగి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.

రైతు పోరాటాలకు అండగా

వైఎస్సార్‌ సీపీ

పొగాకు రైతులు చేస్తున్న పోరాటానికి వైఎస్సార్‌ సీపీ అండగా నిలుస్తోంది. వేలం కేంద్రాలను సందర్శించి రైతుల పోరాటాలకు పూర్తి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లాలోని కీలకమైన నాయకులంతా పొగాకు వేలం కేంద్రాలను పరిశీలించి రైతులకు అండగా నిలిచారు. పొదిలి వేలం కేంద్రంలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, అన్నా రాంబాబు, దద్దాల నారాయణ యాదవ్‌, కందుకూరులోని వేలం కేంద్రాన్ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితోపాటు, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, కొండపిలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌, వెల్లంపల్లిలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలులో నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబులతో పాటు పలువురు కీలక నేతలు ఆయా వేలం కేంద్రాల్లో ధర్నాలకు దిగారు. పొగాకు రైతులను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. పొగాకు రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడకపోవడం, కంపెనీలు సిండికేట్‌ అయి ధరలు తగ్గించేస్తుండడంతో రైతులు మునిగిపోతున్నారు.

నత్తనడకన కొనుగోళ్లు

ఒంగోలు రీజియన్‌ పరిధిలో అధికారిక, అనధికారిక ఉత్పత్తులు కలిపి దాదాపు 140 మిలియన్‌ కేజీల వరకు ఉండవచ్చని బోర్డు అధికారుల అంచనా. ఇప్పటి వరకు 11 వేలం కేంద్రాల పరిధిలో 31 మిలియన్‌ కేజీల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే కొనుగోళ్లు ఏవిధంగా నత్తనడకన సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి వేలం కేంద్రం పరిధిలో 35 నుంచి 40 శాతం వరకు తిరస్కరణలు ఉంటున్నాయి. వేలం ఇదే విధంగా కొనసాగితే వచ్చే సీజన్‌ వరకు కూడా వేలం పూర్తి కాదని రైతులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో ధరలు కూడా రోజు రోజుకూ పతనమవుతున్నాయి. ఎస్‌బీఎస్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో కేజీ సరాసరి ధర రూ.202.51, ఎస్‌బీఎస్‌ పరిధిలోని ఆరు వేలం కేంద్రాల పరిధిలో రూ.212.62గా ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో నమోదవుతున్న ధరలను చూస్తే ఈ సరాసరి ధరలు మరింత పతనం అవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అదే సందర్భంలో ప్రస్తుతం బ్రైట్‌ గ్రేడ్‌ పొగాకు ఉత్పత్తుల కొనుగోళ్లలో కూడా ధరలు తగ్గుతుండడం మరింత ఆందోళన కలిగించే అంశం.

పొగాకు రైతులకు

భరోసా కల్పిస్తాం

పొగాకు రైతుల సమస్యలను పార్టీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. రైతులకు అండగా నిలిచేందుకు క్షేత్ర స్థాయి పర్యటనకు వస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం దిగివచ్చి వారికి మద్దతు ధర కల్పించాల్సిందే. అప్పటి వరకు వైఎస్సార్‌ సీపీ పొగాకు రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది. మద్దతు ధరలు కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి.

– బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌

పొగాకు మార్కెట్‌లో మూడు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. వ్యాపారుల సిండికేట్‌, ప్రభుత్వ నిర్లక్ష్యంతో గిట్టుబాటు ధరలు లేక పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ధరల కోసం రైతులు నిరంతరం

ఆందోళనలు చేస్తున్నా పాలకులు ఉత్తుత్తి షోలకు పరిమితమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరల్లేక ఆర్థికంగా చితికిపోతున్న

రైతులకు వైఎస్సార్‌ సీపీ అండగా నిలిచింది. జిల్లాలోని పలు వేలం కేంద్రాల్లో రైతుల పోరాటాలకు మద్దతు తెలిపింది. బుధవారం

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ సీపీ నాయకులు, పొగాకు రైతులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement