● కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం టౌన్: జిల్లాలో రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం.విజయ సునీత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మార్కాపురం కలెక్టరేట్లో తహసీల్దార్లు, మండల, గ్రామ సర్వేయర్లు, వీఆర్వోలతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30 తేదీకల్లా సర్వే డేటాను తహసీల్దార్ల లాగిన్లో పూర్తి చేయాలన్నారు. ఇంకా సర్వే పూర్తికాని, గ్రామాల్లో నిర్లక్ష్యం చేయకుండా ఇచ్చిన గడువులోపు రెవెన్యూ సిబ్బంది ఈ ప్రక్రియను ముగించాలని తెలిపారు. వీఆర్వో, సర్వేయర్ లాగిన్ లలో పెండింగ్‌లో ఉంచుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే మరి కొంతమంది సహకారంతో రీ సర్వే పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని తహసీల్దార్లు చూడాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. అనుకున్న ప్రకారం సెప్టెంబర్ లో రైతులకు నూతన పాస్ పుస్తకాలు అందజేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: మద్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రతి నెలా 5వ తేదీలోపు బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు కే.కోటేశ్వరమ్మ డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బుధవారం మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరమ్మ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వలన వేలాది మంది కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, ఒక విద్యార్థికి రూ.20 ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్యాస్ కొరత వలన ఎక్కువ ధరలకు గ్యాస్ కొనుగోలు చేయాల్సి వస్తుందని, ప్రభుత్వమే నేరుగా గ్యాస్ సరఫరా చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా నాయకులు మంజుదార్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు 10 నెలల వేతనం కాకుండా 12 నెలలకు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 31వ తేదీ కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ధర్నాకు సంబంధించి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
నాగులుప్పలపాడు: రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయంత్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా జయంత్‌బాబు మాట్లాడుతూ ఆగస్టు నెల వస్తున్నా రైతుల వద్ద ఉన్న వర్జీనియా పొగాకు అమ్ముడుపోక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యాపారులు నోబిడ్ పేరుతో చెక్కులు వెనక్కి పంపుతూ కొనుగోలు చేయకపోవడంతో పాటు ధరలు కూడా తగ్గించారన్నారు. దీంతో బ్యారన్‌కు ఒక్కో రైతుకు రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు నష్టపోతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే రూ.వెయ్యి కోట్లు కేటాయించి రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు చేయాలని రైతు సంఘం తరఫున చేపట్టిన బైక్ ర్యాలీ గురువారం ఉదయం 7 గంటలకు ఒంగోలు మండలం కరవదిలో ప్రారంభమవుతున్నారు. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చేరుకుంటారని, అనంతరం చీర్వానుప్పలపాడు, నాగులుప్పలపాడు, నిడమానూరు గ్రామాల మీదుగా మద్దిపాడు మండలం బూరేపల్లి, గుండ్లాపల్లి, తెల్లబాడు, దొడ్డవరం గ్రామాల వరకు చేరుకుంటుందని తెలిపారు. ఈ ర్యాలీలో రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.


