మెగా కాదు..దగా డీఎస్సీ | - | Sakshi
Sakshi News home page

మెగా కాదు..దగా డీఎస్సీ

Jun 2 2026 6:05 AM | Updated on Jun 2 2026 6:05 AM

నిరుద్యోగుల భవిష్యత్‌తో కూటమి ప్రభుత్వం చెలగాటం డీఎస్సీ ప్రక్రియలో లోపించిన పారదర్శకత స్పోర్ట్స్‌ కోటా, రిజర్వేషన్లలో అక్రమాలపై విచారణ చేపట్టాలి డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి

ఒంగోలు సిటీ: మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, నిరుద్యోగులకు ఆశ చూపించి చివరకు వారి భవిష్యత్‌తో చెలగాటం ఆడిందని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు పార్టీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులో సోమవారం ధర్నా నిర్వహించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక అంబేడ్కర్‌ భవన్‌ నుంచి పార్టీ నాయకులు, అభిమానులు, నిరుద్యోగులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్‌ రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎస్సీ అనేది లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన సున్నితమైన ప్రక్రియ అన్నారు. డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, మెరిట్‌లిస్టులు బహిరంగంగా ప్రకటించకపోవడం, కేవలం ఎంపికై న అభ్యర్థులకు మాత్రమే ఎస్‌ఎంఎస్‌లు పంపడం, కాల్‌ లెటర్ల విషయంలో సృష్టించిన గందరగోళం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నారు. డీఎస్సీ నియామకాలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో లేదా సీబీఐతో న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ప్రశ్నా పత్రాల తయారీ, అప్‌లోడ్‌ నిర్వహణలో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్ట్‌ సిబ్బంది పాత్రపై పూర్తి విచారణ జరపాలన్నారు. మెరిట్‌ లిస్టులు, మార్కులు, ఎంపిక వివరాలను పూర్తిగా ప్రజలకు వెల్లడించాలన్నారు. అక్రమంగా ఎంపికై న వారిపై చర్యలు తీసుకొని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. స్పోర్ట్స్‌ కోటాలో ఫేక్‌ సర్టిఫికెట్లతో పోస్టులు కేటాయించారని, ఒక్కో పోస్టుకు లక్షల రూపాయలు పెట్టి పోస్టులు కొనుగోలు చేశారని విమర్శించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అర్హులైన అభ్యర్థులకు పోస్టులు ఇవ్వకపోవడం, కోర్టు వ్యాఖ్యల తర్వాత కూడా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలపై నిర్లక్ష్యాన్ని చూపుతోందన్నారు. ఈ డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖామంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగ యువత భవిష్యత్తు బలి కాకూడదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు శేషారెడ్డి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దేవప్రసాద్‌, వివిధ నియోజకవర్గాల యూత్‌ అధ్యక్షులు సన్ని, అన్వేష్‌, గంగాధరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, చంద్రమోహన్‌, రాజశేఖరరెడ్డి, రాష్ట్ర యూత్‌ జనరల్‌ సెక్రటరీ మహానందరెడ్డి, రాష్ట్ర యూత్‌ కార్యదర్శి నెమలిదిన్నె చెన్నారెడ్డి, జిల్లా యూత్‌ జనరల్‌ సెక్రటరీ అడుసుమల్లి ప్రసన్నకుమార్‌, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, రాష్ట్ర క్రిష్టియన్‌ మైనార్టీ సెల్‌ సెక్రటరీ గుంటు పోలయ్య, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement