రేషన్‌కు ఈకేవైసీ గండం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌కు ఈకేవైసీ గండం

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

ఈ–కేవైసీ లేకపోతే కార్డుదారులకు రేషన్‌ బంద్‌ జిల్లాలో 36,205 మందికి ఈ–కేవైసీ నిల్‌

జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాలు:

21

మార్కాపురం: జిల్లా వ్యాప్తంగా ఈ–కేవైసీ చేయించుకోని రేషన్‌కార్డుదారులకు రేషన్‌ సరఫరా నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పలువురు కార్డుదారులు ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు. పనుల కాలం కావడంతో రేషన్‌షాపుల వద్దకు వెళ్లలేక పలువురు లబ్ధిదారులు రేషన్‌ తీసుకోవడం లేదు. దీంతో రేషన్‌కార్డు ద్వారా వచ్చే ఇతర పథకాలు కూడా ఆగిపోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని 21 మండలాల్లో 743 రేషన్‌ షాపుల్లో 10,15,212 మంది రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. ఇప్పటి వరకూ 36,205 మంది ఈ–కేవైసీ చేయించుకోలేదు. ఈనెలాఖరులోపు ఈ–కేవైసీ చేయించుకోకుంటే రేషన్‌తోపాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి. పలువురు వలసపోవడం, ఈ–కేవైసీపై అవగాహన లేకపోవడం, రేషన్‌ డీలర్ల నిర్లక్ష్యం తదితర కారణాలతో ఈ–కేవైసీ చేయించుకోలేకపోయారు.

ఎక్కువగా జిల్లా కేంద్రమైన మార్కాపురంలోనే 3620 మంది కార్డుదారులు ఈ–కేవైసీ చేయించుకోవాలి. కనిగిరిలో 2409, గిద్దలూరులో 2319, త్రిపురాంతకంలో 2138, యర్రగొండపాలెంలో 2527, పామూరులో 2209, దోర్నాలలో 2218 మంది లబ్ధిదారులు ఈ–కేవైసీకి దూరంగా ఉన్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ చేయించకపోతే వీరందరికీ రేషన్‌తోపాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి.

మొత్తం రేషన్‌కార్డులు:

10,15,212

జిల్లాలో మొత్తం రేషన్‌ దుకాణాలు:

743

ఈ–కేవైసీ చేయించుకోనివారు:

36,205

నెలాఖరులోపు చేయించుకోవాలి

ఈనెలాఖరులోపు ఈ–కేవైసీ చేయించుకోని రేషన్‌కార్డుదారులందరూ తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. లేకపోతే రేషన్‌ నిలిపేస్తారు. ప్రతి ఒక్కరూ రేషన్‌, పథకాలు పొందాలంటే ఈ–కేవైసీ తప్పనిసరి.

– చిరంజీవి, తహశీల్దార్‌

Advertisement
 
Advertisement
Advertisement